- ప్లాంట్ సమస్యలు పరిష్కారమవుతయ్: రామ్మోహన్ నాయుడు
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమారస్వామికి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, వెలుగు: విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి ఆయన మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2014 వరకు లాభాల్లో నడిచిందని తెలిపారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ అప్పు రూ.35 వేల కోట్లు ఉందని, బ్యాంకు రుణాలు, వడ్డీ, సరకు సరఫరాకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. ప్లాంట్‌కు సహాయ సహకారాలు అందించాలని కోరగా బ్యాంకులు అంగీకరించలేదని తెలిపారు.
దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయంతో చర్చించానని, పీఎంవోతో చర్చల తర్వాత సత్ఫలితాలు వచ్చాయన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సహాయం చేసేందుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారన్నారు. పీఎంవోతో చర్చల తర్వాత సెప్టెంబర్‌లో రూ.500 కోట్లు విడుదల చేశామని, 2024 అక్టోబర్ 9న ఆర్థిక సాయానికి కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకరించారని వెల్లడించారు.
ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్‌బీఐ నేతృత్వంలో కమిటీ వేశామని, కమిటీ నివేదికపై జీఓఎం చర్చల తర్వాత రూ.11,440 కోట్ల ప్యాకేజీకి నిర్ణయం జరిగిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణను మంత్రివర్గం సవాల్‌గా తీసుకుందని, మూడు ఫర్నేస్‌లతో 92.3 శాతం ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ప్లాంట్ రెండేళ్లలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను అప్పుల్లో నుంచి బయటకు తేవడమే ప్రథమ కర్తవ్యమని, పూర్తిస్థాయిలో ప్లాంట్ పునరుద్ధరణ తర్వాత సెయిల్‌లో విలీనంపై ఆలోచిస్తామన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్యాకేజీకి ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ప్యాకేజీతో ప్లాంట్ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయన్నారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదాన్ని కేంద్రం కాపాడిందన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ చెప్పారు.
ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం: మోదీ
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో విశాఖ ఉక్కు ప్లాంట్ ది ప్రత్యేక స్థానమని ప్రధాని మోదీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం తరఫున ప్యాకేజీని ప్రకటించిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. స్టీల్ ప్లాంట్కు రూ.10,000 కోట్లకు పైగా ఈక్విటీ మద్దతు ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే దిశగా ఉక్కు రంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని స్టీల్ ప్లాంట్‌కు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.