- అమెరికా నుంచి వచ్చిన బాధితుడు
- మత్తుమందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి ప్రైవేటు పార్టుల ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిలింగ్
- బాధితుల్లో ఐటీ ఉద్యోగులు, ఎన్నారైలు
హైదరాబాద్, వెలుగు: విశాఖపట్నం హనీ ట్రాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇన్‌స్టాగ్రాంలో ఓ ఎన్నారైని ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్‌కు గురిచేసిన జాయ్ జమీమా (27) ను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బ్యాంకు ఖాతాలు, నెట్‌వర్క్ ను ట్రేస్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిందితురాలికి పలు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా బ్యాంకుల వివరాల ఆధారంగా హైదరాబాద్ పోలీసులకు విశాఖ పోలీసులు సమాచారం ఇచ్చారు. జాయ్ జమీమాతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా జాయ్ జమీమా నెట్‌వర్క్ హైదరాబాద్‌లో కూడా విస్తరించినట్లు గుర్తించారు. విశాఖలోని మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జమీమా.. ఇన్‌స్టాగ్రాంలో హైప్రొఫైల్ ఉన్న ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారితో పాటు మ్యాట్రిమోనీలో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వల విసిరింది. అందమైన ఫొటోలు, అర్ధనగ్న దుస్తుల్లో ఆకర్షించింది. 25 నుంచి 30 ఏండ్ల వారిని టార్గెట్‌గా చేసుకుంది. తన ట్రాప్‌లో చిక్కిన వారిని ముందుగా ప్రేమ పేరుతో చాటింగ్ చేసి వీడియో కాల్స్ చేసింది. తర్వాత వ్యక్తిగతంగా కలుద్దామంటూ హోటల్ రూమ్స్‌కి తీసుకెళ్లింది. అప్పటికే మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్స్, ఇతర పదార్థాలు ఇచ్చింది. తన గ్యాంగ్ తో వారిని అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీయించింది. తర్వాత వాటిని చూపుతూ బ్లాక్ మెయిల్ చేసింది.
ట్రాప్ చేసి అమెరికా నుంచి విశాఖ రప్పించి
విశాఖలోని షీలా నగర్‌కు చెందిన ఓ యువకుడిని జమీమా ఇన్‌స్టాగ్రాంలో ట్రాప్ చేసింది. ఆ యువకుడికి అప్పటికే పెండ్లయి అమెరికా వెళ్లిపోయాడు. అతడికి వలవేసి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లింది. మత్తుమందు కలిపిన డ్రింక్స్ ను అతడికి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక ప్రైవేట్ ఫొటోలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసింది. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరించింది. ఫ్రెండ్స్ తో కలిసి చంపడానికి కూడా ప్రయత్నించింది. బాధితుడు ఎలాగోలా ఈ నెల 4న తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు జెమీమాను శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని పలువురు యువకులను కూడా ట్రాప్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులకు విశాఖ సీపీ బాగ్చి సమాచారం అందించారు. నిందితురాలి బ్యాంకు ఖాతాల్లోని క్యాష్‌ను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.