అతను లోక్ సభ ఎంపీ.. అతని ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు దుండగులు.. ఎంపీ భార్య, కొడుకును కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన అక్కడో ఇక్కడో కాదు.. ఏపీ రాజధాని విశాఖపట్నంలో జరిగింది. కిడ్నాప్ చేసింది కూడా విశాఖపట్నం ఎంపీని.. అధికార పార్టీకి చెందిన ఎంపీ ఫ్యామిలీని.. ఈ విషయం తెలిసి దేశమే షాక్ అయ్యింది. దేశంలోనే సంచలనంగా మారిన ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వివరాల్లోకి వెళితే..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన.. విశాఖపట్నం లోక్ సభ ఎంపీ అయిన ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ ను మొదటగా కిడ్నాప్ చేశారు దుండగులు. ఆ తర్వాత మీ కుమారుడిని కిడ్నాప్ చేశామంటూ ఎంపీ భార్య జ్యోతికి సమాచారం ఇచ్చి.. తాము ఉన్న లోకేషన్ కు రప్పించారు. ఎంపీ భార్య, కుమారుడిని అడ్డుపెట్టుకుని.. ఎంపీ సత్యనారాయణ ఆర్థిక లావాదేవీలు చూస్తే ఆడిటర్ జీవీకి సమాచారం ఇచ్చారు. డబ్బులు తీసుకురావాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. దీంతో ఆడిటర్ జీవీ.. తన దగ్గర ఉన్న డబ్బులను తీసుకుని కిడ్నాపర్ల దగ్గరకు వెళ్లారు జీవీ. ఇక్కడే కిడ్నాపర్లు మరో డ్రామాకు తెరతీశారు. ఇంకా డబ్బులు కావాలని.. మొత్తం 50 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎంపీ సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు.
కిడ్నాప్ చేసింది ఎవరు ?
విశాఖ ఎంపీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ ను కిడ్నాప్ చేసింది రౌడీషీటర్ హేమంత్ అని తేల్చారు పోలీసులు. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డి హత్య కేసులో హేమంత్ ప్రధాన నిందితుడు. ఇతను సెటిల్ మెంట్లు చేస్తూ ఉంటాడు. హత్య కేసులే కాకుండా హేమంత్ పై పలు కేసులు ఉన్నాయి. ఎంపీ ఫ్యామిని కిడ్నాప్ వెనక హేమంత్ మాస్టర్ మైండ్ ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు.
వేగంగా స్పందించిన పోలీసులు : ఎంపీ ఫ్యామిలీ సేఫ్
విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ను క్షేమంగా విడిపించారు. నాలుగున్నర గంటల్లోనే కిడ్నాప్ ను ఛేదించారు పోలీసులు. కిడ్నాప్ అయిన ప్రాంతం నుంచి ఎంపీ ఫ్యామిలీని విశాఖకు తీసుకొచ్చారు పోలీసులు.
కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరి వెళ్లారు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తానంటూ ప్రకటించారు.