సూర్యాపేట, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా వెనుకబడి ఉన్నాయని, వారిలో చైతన్యం తీసుకురావడానికే ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల యుద్ధంలో నిలిచిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.
ఎన్నికలంటే పండుగ కాదని..అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు దక్కే సువర్ణ అవకాశమన్నారు. తెలంగాణ సంపద మొత్తం మూడు, నాలుగు కులాల వద్దే ఉందని, 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలు ఇంకా కూలీనాలీ చేసుకుని బతుకుతున్నారన్నారు. ఈ శ్రామికుల దగ్గర సంపద లేకున్నా.. ఓటు అనే ఆయుధం ఉందన్నారు.
మన ఓట్లు మనమే వేసుకుంటే రాజ్యాధికారం వస్తుందని.. దాంతో సంపద పెరుగుతుందన్నారు. ధర్మాన్ని రక్షించేందుకు ధర్మ సమాజ్‌పార్టీ ఎన్నికల బరిలో నిలిచిందన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి ధర్మ సమాజ్ పార్టీ తరపున అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌ను నిలబెడుతున్నామని, అతని వద్ద సంపద లేకున్నా మంచి చేయాలన్న గుణముందన్నారు. దళిత బిడ్డకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించి ఓటు వేయాలని కోరారు.