
చండీగఢ్ విమానాశ్రయంలో ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే CISF కానిస్టేబుల్‌కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ ఈ CISF సిబ్బంది అయిన ఆ అమ్మాయి కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు. కుల్విందర్ కౌర్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎవరైనా ఆమెను సంప్రదించి నన్ను కంటాక్ట్ చేయండి. ఆమెకు ఉద్యోగం లభిస్తుందని నేను మాటిస్తున్నానంటూ మరో పోస్ట్ చేశాడు విశాల్ దద్లానీ.
ఇక ఎంపీ కంగనా రనౌత్‌ను చెంప దెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రైతులను అవమానించినందుకే తాను చెంప దెబ్బ కొట్టానని కుల్విందర్ కౌర్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాల నేతలు ఈ ఘటనపై స్పందించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని యూనియన్లు కుల్విందర్ కు మద్దతుగా నిలిస్తే.. మరికొన్ని సంఘాలు విమర్శిస్తున్నాయి.