లంచం తీసుకున్నరు.. సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు

సెంట్రల్ సెన్సార్ బోర్డుపై సీనీ హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. ముంబైలో సెన్సార్ బోర్డు సభ్యులు రూ.6లక్షల 50 వేలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. తాను నటించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ కోసం లంచం తీసుకున్నారంటూ డబ్బులు పంపిన  అకౌంట్ డీటేల్స్ తో సహా   ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 సినిమాల్లో అవినీతిని చూపిస్తున్నారు కానీ నిజ జీవితంలో అలా జరగడం లేదన్నారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో  మరీ ముఖ్యంగా ముంబైలోని సీబీఎఫ్ సీ  ఆఫీసులో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తన  సినిమా మార్క్ ఆంటోని  హిందీ వెర్షన్ కోసం ఆరున్నర లక్షల లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. స్క్రీనింగ్  కోసం రూ.3లక్షలు,  సర్టిఫికేట్ కోసం రూ. 3.5లక్షలు  ఇచ్చానని చెప్పారు. ఇలాంటి పరిస్థితి  తనకెప్పుడు ఎదురుకాలేదన్నారు. 

  సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్యవర్తి మేనగాకు డబ్బులు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదన్నారు.  ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను కోరారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అందరి కోసమే తన దగ్గర ఉన్న సాక్ష్యాలు బయటపెడుతున్నానని చెప్పారు.  సత్యం ఎప్పటికీ గెలుస్తుందన్నారు విశాల్.