85% అట్టడుగు వర్గాలుంటేరెడ్డి పరిపాలన ఏంది? : విశారదన్  మహరాజ్ 

85% అట్టడుగు వర్గాలుంటేరెడ్డి పరిపాలన ఏంది? : విశారదన్  మహరాజ్ 
  • బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సీఎం పదవి ఇవ్వనప్పుడు కులగణన ఎందుకు? 
  • ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్  ఫైర్  

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు 85 శాతం ఉన్నపుడు, ముఖ్యమంత్రిగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఎలా పరిపాలిస్తారని ధర్మ సమాజ్  పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్  మహరాజ్  ప్రశ్నించారు. సీఎం పదవి బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఇవ్వనప్పుడు కులగణన ఎందుకు చేశారని ఆయన నిలదీశారు. మంగళవారం వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామంలో అంబేద్కర్  విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.

దీనికి ముఖ్య అతిథులుగా విశారదన్ మహరాజ్, కవి గాయకుడు జయరాజ్  హాజరయ్యారు. విశారదన్ ​మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడిప్పుడే  చైతన్యం అవుతున్నాయన్నారు. ఆ వర్గాలకు చెందిన వారికి సీఎం పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి కాంగ్రెస్  పార్టీ బుజ్జగిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్  కుడా మరో బీసీ బిడ్డను ఎమ్మెల్సీగా చేస్తోందన్నారు.

బడుగుబలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్​పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్, బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి నవీన్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్  మాదిగ తదితరులు పాల్గొన్నారు.