ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. 2023 డిసెంబర్ 13న రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రులుగాఅరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ గా 2003 నుంచి 2018 దాకా వరుసగా మూడు సార్లు సీఎంగా పని చేసిన రమణ్ సింగ్‌ను ఎంపిక చేసింది. త్వరలో కేబినేట్ విస్తరణ ఉండనుంది.
సర్పంచ్ టు సీఎం
ఆర్ఎస్‌ఎస్‌లో పనిచేసిన 59 ఏండ్ల విష్ణు దేవ్ సాయ్ వివాదరహితుడు. వినయం, డౌన్ టు ఎర్త్‌గా ఉండటం, అంకితభావం, లక్ష్యాలను సాధించాలనే తపన కలిగిన వ్యక్తి అని పేరుంది. జష్‌పూర్ జిల్లాలోని బాగియా ఆయన సొంతూరు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తాత బుద్ధనాథ్ సాయ్.. నామినేటెడ్ ఎమ్మెల్యేగా 1947 నుంచి 1952 దాకా కొనసాగారు. విష్ణుదేవ్ పెద్ద నాన్నలు నరహరి ప్రసాద్ సాయ్, కేదార్‌నాథ్ సాయ్ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లే. గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోనే వదిలేసి 1988లో సొంతూరుకు వచ్చిన విష్ణుదేవ్.. 1990లో బాగియా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది బీజేపీ టికెట్‌పై తప్‌కారా ఎమ్మెల్యేగా గెలిచారు. 1993లో గెలిచి, 1998లో ఓడారు.
1999, 2004, 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో రాయ్‌గఢ్ నుంచి వరుసగా గెలుపొందారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ దక్కలేదు. మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు సన్నిహితుడని పేరుంది. చత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా మూడుసార్లు కొనసాగారు. అంతకుముందు బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో కుంకురి నుంచి 25,541 ఓట్ల మెజారిటీతో విష్ణు దేవ్ గెలుపొందారు.