- విష్ణు పుష్కరిణిలో భక్తుల స్నానాలు చేయడానికి 11 నుంచి అనుమతి
- టికెట్ ధర రూ.500, రూ.250
- వీఐపీ దర్శనం, లడ్డూ ఫ్రీ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరి కొండపై భక్తులకు పుణ్యస్నానాలు చేసే అవకాశాన్ని దేవస్థానం కల్పించనుంది. ఇందుకోసం కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిని ఈనెల 11 నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా విష్ణు పుష్కరిణిని ఆలయ ఈవో ఏ భాస్కర్రావు ఆదివారం పరిశీలించారు. కొండపై గతంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేవారు. పునర్నిర్మాణంతో భక్తులకు ఆ అవకాశం లేకుండా చేశారు.
కొండ కిందే ఏర్పాటు చేసిన లక్ష్మీ పుష్కరిణిలో ఇప్పుడు భక్తులు స్నానాలు చేస్తున్నారు. కొండపై కూడా పుణ్యస్నానాలు చేయాలని భక్తులకు ఉన్పప్పటికీ అది నెరవేరడం లేదు. అయితే, భక్తుల కోరిక మేరకు కొండపై పుణ్యస్నానాలకు అవకాశమివ్వాలని ఇటీవల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొండపై విష్ణు పుష్కరిణిలో ఈనెల 11 నుంచి ‘స్నాన సంకల్పం’ పేరుతో అవకాశం ’కల్పించనున్నారు. అయితే దీని కోసం టికెట్ తీసుకోవాలని ఈవో భాస్కర్రావు తెలిపారు.
దంపతులకు రూ .500, ఒక్కరికి అయితే రూ.250 రేటు నిర్ణయించినట్టు చెప్పారు. టికెట్ తీసుకున్న వారు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పుణ్యస్నానం చేయొచ్చు. అయితే.. ఈ టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా వీఐపీ దర్శనంతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ కూడా అందిస్తామని ఈవో తెలిపారు.