కాంగ్రెస్ నేతలు త్వరలోనే గాంధీభవన్ను అమ్ముతరు: విష్ణువర్ధన్ రెడ్డి

విష్ణువర్దన్ రెడ్డికి కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందన్నారు మంత్రి హరీశ్ రావు.  బీఆర్ఎస్ లో  విష్ణువర్ధన్ కు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. విష్ణువర్ధన్ తో  మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లోకి రావాలని కోరారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు..  విష్ణు త్వరలో బీఆర్ఎస్ లో చేరుతారని తెలిపారు.   ఉద్యమంలో విష్ణు తాము  కలిసి పనిచేశామని చెప్పారు.   కాంగ్రెస్ నాయకులు ఒక్కో టికెట్ ను 5 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలు  తెలంగాణ ద్రోహులకు తెలంగాణ వాదులకు మధ్య  జరుగుతున్నాయన్నారు. 

త్వరలో గాంధీ భవన్ ను అమ్ముతరు

త్వరలో బీఆర్ఎస్ లో చేరుతానన్నారు కాంగ్రెస్ నేత పి. విష్ణువర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ లో ప్రస్తుతం గాంధీ భవన్ ను  అమ్మే పరిస్థితి నెలకొందన్నారు. త్వరలోనే గాంధీ భవన్ కూడా అమ్మేస్తారని విష్ణువర్ధన్ ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ తనకు ఇంత అన్యాయం చేస్తుందనుకోలేదన్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్టు వచ్చిన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. 

విష్ణువర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికిట్ ఆశించారు. ఈ సారి అజారుద్దీన్ కు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. సీటు దక్కకపోవడంతో విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన అనుచరులు గాంధీభవన్ దగ్గరకు వెళ్లి ఇటుకలతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 29న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు విష్ణువర్ధన్ .