- వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి,
- మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించాలి : వీహెచ్ పీ
ఖైరతాబాద్, వెలుగు : కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెతో లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా అందించిన వారిని తక్షణం అరెస్ట్‌చేసి విచారించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వీహెచ్ పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి
కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డిని అరెస్ట్‌చేసి విచారించాలని కోరారు. ఈ ఘటనపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. సాక్షాత్తూ ఆ ఏపీ సీఎం చంద్రబాబు కల్తీపై మాట్లాడారని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలోనున్న ఆలయాలన్నిటిని ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి అప్పగించాలన్నారు. హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.
జంతువుల నుంచి తీసిన నూనెతో లడ్డూలను తయారు చేసిన అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా హిందువుల మనోభావాలను గౌరవించి, వారి విశ్వాసానికి అనుగుణంగా నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, తనికెళ్ల సత్యరవికుమార్, డాక్టర్ సునీత, డాక్టర్ రామ్ సింగ్, బాలస్వామి పాల్గొని మాట్లాడారు.
గోవధ నిషేధ చట్టం అమలుచేయాలి : కొలిశెట్టి
గోవధ నిషేధ చట్టాన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయకపోవడం వలనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని యుగతులసి పౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ అన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెన్నైకి చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ పర్చేజ్ కమిటీలో సభ్యుడని ఇతని నియామకం కోసం అమిత్‌షా రికమండ్ చేశారని తెలిపారు.