ధర్మ పరిరక్షణే..విశ్వహిందూ పరిషత్ లక్ష్యం.. వీహెచ్​పీ 60 ఏండ్లు

ధర్మ పరిరక్షణే..విశ్వహిందూ పరిషత్ లక్ష్యం.. వీహెచ్​పీ 60 ఏండ్లు

హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్​పీ) 60 ఏండ్లు పూర్తి చేసుకుంది.  హిందూ జీవన విధానం విశ్వవ్యాప్తం చేయడం కోసం లెక్కకు మించి పోరాటాలు నిర్వహించి విజయం సాధిస్తోంది.  హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం, లోక కల్యాణం కోసం సమాజసేవ చేయడం తద్వారా హిందూ ధర్మాన్ని రక్షించడమే లక్ష్యంగా పని చేస్తోంది.  హిందువులను జాగృతం చేసేందుకు వీహెచ్​పీ అహర్నిశలు కృషి చేస్తోంది.ప్రధానంగా ‘అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఉద్యమం’  చరిత్రాత్మకం.   సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పోరాటం అది.  

వందల ఏండ్ల క్రితం మహమ్మదీయ రాజు బాబర్ పాలనలో నేల కూలిన అయోధ్య రామ మందిరాన్ని ఇటీవల 21 జనవరి 2024 వ  తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభించడం హైందవ స్వాభిమానానికి సంకేతం.  వేలాదిమంది ప్రాణ త్యాగానికి చిహ్నం.  ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి హిందువు పండుగ  చేసుకున్న మధుర క్షణాలు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సుమధుర ఘట్టం. 

పట్టు వీడని విక్రమార్కుల్లా అనేక సవాళ్లు ఎదుర్కొని, న్యాయ పోరాటం చేసి అద్వితీయ విజయం వీహెచ్​పీ సాధించింది.  భవ్యమైన మందిరం నిర్మించి న భూతో న భవిష్యత్  అనే రీతిలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు గర్వపడేలా పండుగ నిర్వహించింది.  అనేక రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని హిందువులను సంఘటితంగా చేస్తున్న సంస్థ విశ్వహిందూ పరిషత్. ‘హిందువునని గర్వించు.. -హిందువుగా జీవించు’ అంటూ ప్రపంచంలోని హిందువులను ఏకం చేస్తోంది.  నీతి, నిజాయితీతో జీవించాలని ‘ధర్మో రక్షతి రక్షితః’ అంటూ ముందుకు సాగుతోంది. 

సామాజిక సామరస్యతకు పెద్దపీట

ప్రపంచంలోని ప్రతి హిందువుకు అండగా ఉండేందుకు కార్యక్రమాల రూపకల్పన చేస్తూ ధైర్యంగా నిలబడుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే హిందువులందరికీ విశ్వహిందూ పరిషత్  వెన్నెముక లాంటిది. హిందువులు దైవంగా భావించి పూజించే గోమాత రక్షణ విషయంలో  వెన్నుచూపని ధర్మపోరాటం సాగిస్తోంది.  ముక్కోటి దేవతలకు నిలయంగా భావించి ఆరాధిస్తున్న ఆవుల రక్షణకు ప్రాణాలను సైతం లెక్కచేయక సమర శంఖం పూరిస్తోంది విశ్వహిందూ పరిషత్ గోరక్ష విభాగం.  కులాలు, ప్రాంతాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఆసరాగా చేసుకుని హిందువులను మతం మారుస్తున్న మాఫియాను అడ్డుకొని హిందూ రక్షణ చేస్తోంది. తెలిసీ తెలియక మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు ‘సంస్కృతి దీక్ష యజ్ఞం’ (ఘర్ వాపసి) నిర్విరామంగా  కొనసాగిస్తోంది.  హిందువులందరూ సహోదరులే. హిందూత్వంలో అంటరానితనానికి ఆస్కారం లేదు. హిందూ రక్షణే మా దీక్ష. అంటరానితన నిర్మూలనే మా లక్ష్యం అంటూ.. సామాజిక సామరస్యతకు వీహెచపీ పనిచేస్తోంది.

వీహెచ్​పీ ఆవిర్భావానికి 60 ఏండ్లు

లవ్ జిహాద్​కు పాల్పడుతున్న దుర్మార్గులకు బుద్ధి చెప్పేందుకు బజరంగ్ దళ్​ను తయారుచేసింది. హిందూ యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు భజరంగ్ దళ్ చేస్తున్న కృషి అద్వితీయం. హిందూ యువతులకు భారతీయ విలువలు.. సంస్కృతి, సంప్రదాయంపై అవగాహన పెంచేందుకు, కుటుంబ వ్యవస్థ బలోపేతం కోసం ‘దుర్గా వాహిని’ అనే సంస్థకు  పురుడు పోసింది.  మఠ మందిరాలను సంరక్షిస్తూ.. దేవాలయ ప్రాశస్త్యం, పవిత్రతను కాపాడుతోంది. 1964 శ్రీకృష్ణ  జన్మాష్టమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ద్వితీయ సర్ సంఘ్ చాలక్ ( సెకండ్ చీఫ్)  శ్రీ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ)  ముంబై సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్​కు జీవం పోశారు.

నాటి ఆ మహత్తర  వేడుకకు దేశంలోని అనేకమంది సాధూ సంతులు హాజరై వీహెచ్​పీ ఆవశ్యకత ప్రతి హిందువుకు అవసరమని తేల్చి చెప్పారు.  విశ్వ హిందూ పరిషత్ (1964–-2024) 60 ఏండ్లు షష్ఠి పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి( వీహెచ్​ఆవిర్భావ దినోత్సవాన్ని)  ఘనంగా నిర్వహించింది. విశ్వవ్యాప్తంగా విస్తరించిన విశ్వహిందూ పరిషత్ దాదాపు 60 దేశాలతో పాటు భారత్​లోని గల్లీ..పల్లె.. పట్టణం.. నగరం.. మహానగరాల్లో  ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహిస్తోంది.
 

హిందూ సంస్థలకు మార్గదర్శిగా వీహెచ్​పీ

ఆధ్యాత్మికత, కట్టు, బొట్టు, వ్యవహారం, పండుగ, నియమనిష్టలు ఆధారంగా హిందూ పద్ధతులను పరిరక్షిస్తోంది. ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని, నాగరికతను అందించి దారి చూపిన ధర్మం గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని పెకిలించి వేసేందుకు దుష్టశక్తులు కట్టకట్టుకొని తీవ్రమైన దాడులు నిర్వహిస్తున్నాయి. వాటన్నింటినీ తిప్పి కొట్టి హైందవ పునర్ వైభవం కోసం విశేషంగా కృషి చేసేందుకు జాగృతం చేస్తోంది విశ్వహిందూ పరిషత్.  లక్షల ఏండ్లుగా వస్తున్న గొప్ప హైందవ పరంపరను దశ దిశలా విస్తరించేందుకు ప్రతి హిందువును సంఘటితం చేసి ధర్మరక్షణకు బద్దులను చేస్తోంది. 

 ప్రపంచంలోనే అన్ని హిందూ సంస్థలకు విశ్వహిందూ పరిషత్ మార్గదర్శకంగా నిలుస్తోంది.  సర్వం త్యాగం చేసి పనిచేసే కోట్లాదిమంది సైన్యం విశ్వహిందూ పరిషత్ లో  సభ్యులుగా ఉండటం విశేషం.  వేలాదిమంది కార్యకర్తలు జీవితాన్ని త్యాగం చేసి ధర్మకార్యంలో పూర్తి సమయం వెచ్చించి పనిచేస్తుండటం ఆదర్శనీయం.  కార్యకర్తల కృషి కారణంగా దేశంలో 80 వేలకు పైగా  కమిటీలను ఏర్పాటు చేసి,  ప్రతి పల్లె, తండా,  గ్రామ సీమల్లో సైతం విశ్వహిందూ పరిషత్  జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు అహోరాత్రులు శ్రమిస్తుండటం విశేషం. ముఖ్యంగా  మాత, భూమాత, గోమాత , గంగా మాత, పవిత్ర గ్రంథాలు (భగవద్గీత రామాయణం)  పరిరక్షణ కోసం తపిస్తూ.. లోక కల్యాణం కోసం వీహెచ్​పీ పనిచేస్తోంది.

- -- పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రసార ప్రముఖ్,విశ్వహిందూ పరిషత్, తెలంగాణ