విశ్వకర్మ పథకం : కుల వృత్తుల వారికి రూ. 15 వేలు ఉచితం...వడ్డీ లేకుండా రూ. లక్ష అప్పు

77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ  కొత్త పథకం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. విశ్వకర్మ  పథకాని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.  సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి రోజున ఈ  పథకాన్ని ప్రారంభించనునన్నట్లు చెప్పారు. ఈ మేరకు విశ్వకర్మ యోజన పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

ఈ పథకంలో ఏ కులాల వారికి సాయం..

పీఎం విశ్మకర్మ యోజన పథకం కింద నాయీ బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి,కుమ్మరి,  ఇతర కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, అవసరమైన ఆధునిక పనిముట్లను కొనుక్కోవడం కోసం రూ. 15 వేల వరకు ఉచితంగా ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే రూ. 1 లక్ష వరకు ఈ పథకం కింద తక్కువ వడ్డీతో రుణం కూడా అందుతుంది. రెండో విడతలో రూ. 2 లక్షల వరకు రుణం అందుతుంది. వృత్తి కళాకారులు తయారుచేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి సహాయం ఉంటుంది. పీఎం విశ్వకర్మ యోజన కింద 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది

పీఎం విశ్వకర్మ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 13,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల వరకు కేటాయింపులు చేయనుంది. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా.. కళాకారులు.. కళా ఉత్పత్తులు, సేవల నాణ్యత, స్థాయిను మరింత మెరుగుపరచడం.. దేశీయ, ప్రపంచ సరఫరా గొలుసుతో  వారిని ఏకీకృతం చేయడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు చెందిన కార్మికుల ఆర్థిక సాధికారతకు ఈ పథకం సహాయపడనుంది.