సిరిసిల్ల టౌన్, వెలుగు: అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్తున్న మృతదేహాన్ని తిరిగి పోస్టుమార్టానికి పోలీసులు తీసుకెళ్లారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన విశ్వనాథుల నాగరాజు నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని సిరిసిల్లలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.
నాగరాజుకు యాక్సిడెంట్ అయిన విషయం పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. చివరి నిమిషంలో పోలీసులు శ్మశానవాటిక వద్దకు చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం చేయాలంటూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్సై చీనానాయక్ తెలిపారు.