విజిట్ మై మసీద్ .. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మసీదు కమిటీ పిలుపు

విజిట్ మై మసీద్ .. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మసీదు కమిటీ పిలుపు
  • కుల, మతాలకు అతీతంగా ఆహ్వానం
  • ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసుకునే చాన్స్
  • నేడు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 దాకా ప్రోగ్రాం

హైదరాబాద్, వెలుగు: జాతీయ సమైక్యత, కుల, మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అన్న భావనతో బంజారాహిల్స్​లోని రోడ్ నంబర్ 10లో ఉన్న మసీద్ ఏ మదీనా కమిటీ ‘విజిట్ మై మసీద్’ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నది. ఎవరైనా మసీదును సందర్శించవచ్చని ప్రకటించింది. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుతున్నది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతించనున్నది. 

గతంలో ఓల్డ్ సిటీలోని నాలుగు మసీదుల్లో ‘విజిట్ మై మసీద్’ ప్రోగ్రామ్ నిర్వహించారు. అప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇస్లాం మత సందేశాన్ని తెలియజేసేందుకు ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్లు తెలిపారు. స్వాత్రంత్య ఉద్యమంలో మైనార్టీల పాత్ర ఏంటో కూడా వివరిస్తామని చెప్పారు. ‘విజిట్ మై మసీద్’ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు ఉన్నతాధికారులు హాజరవుతున్నారని తెలిపారు. ముస్లిం సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. మైనార్టీ మహిళలు ప్రార్థనలు కూడా చేసుకోవచ్చు.

స్వాతంత్ర్య ఉద్యమంలో మైనార్టీలది కీలకపాత్ర

1857లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో మక్కా మసీదు కీలక పాత్ర పోషించిందని ‘విజిట్ మై మసీద్’ నిర్వాహకులు చెప్తున్నరు. హైదరాబాద్‌‌లోని మక్కా మసీదుకు చెందిన మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్‌‌తో కలిసి కోఠిలోని ఆయన ఇంటిని కేంద్రంగా చేసుకుని బ్రిటీష్ బలగాలపై దాడులు చేశారు. తుర్రేబాజ్ ఖాన్ ను బ్రిటీష్ సైన్యం బంధించి హైదరాబాద్‌‌లో ఉరి తీసింది. మౌల్వీ అల్లావుద్దీన్‌‌ను అండమాన్ -నికోబార్ దీవుల్లో ఉన్న జైలులో వేసింది. ఆయన రెండు దశాబ్దాలకు పైగా అక్కడే ఉన్నరు.

అందరికీ ఆహ్వానం పలుకుతున్నం

హైదరాబాద్ సిటీలో చాలా మసీదులు ఉన్నయ్. కానీ, నాన్ ముస్లింలకు మసీదు లోపల ఎలా ఉంటదో తెల్వదు. అలాంటి వారి కోసమే ‘విజిట్ మై మసీద్’ ప్రోగ్రాం ఏర్పాటు చేసినం. ఎవరైనా మసీదుకు రావొచ్చు. ఇస్లాం, ముస్లిం సమాజంపై చాలా అపోహలు ఉన్నయ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తం. ఆర్ట్ గ్యాలరీతో ముస్లిం సంస్కృతి, సంప్రదాయా లను తెలియజేస్తం. మసీద్​కు వచ్చినోళ్లందరికీ టీ, స్నాక్స్ ఏర్పాటు చేస్తాం.

జావేద్, మసీద్ కమిటీ మెంబర్