కామారెడ్డి, వెలుగు: పార్టీ శ్రేణులు, వివిధ మోర్చాల లీడర్లు సమష్టిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పరుశోత్తం రూపాలా దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా కేంద్రంలో వివిధ క్షేత్ర కమిటీలతో భేటీ అయ్యారు. బీబీపేటలో జహీరాబాద్పార్లమెంట్పరిధిలోని పార్టీ వివిధ మోర్చాల మండలాధ్యక్షులు, జిల్లా పదాధికారులతో మీటింగ్నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి టిఫిన్ బైటక్లో భాగంగా భోజనం చేశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ..
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ అంశాలపై యువమోర్చా క్షేత్ర స్థాయిలో పోరాడాలన్నారు. రైతు రుణమాఫీ, రైతుల సమస్యలపై కిసాన్‌మోర్చా, మహిళల సమస్యలపై మహిళా మోర్చా పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్అరుణతార, జిల్లా ఇన్చార్జి మహిపాల్‌రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నీలం చిన్న రాజు పాల్గొన్నారు.
కోళ్ల పెంపకం ఎలా ఉంది?
భిక్కనూరు: పార్లమెంటరీ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాలా ఆదివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భిక్కనూరు మండల కేంద్రంలోని కేజేఎల్ కోళ్ల పరిశ్రమను ఆయన పరిశీలించారు. పరిశ్రమ ఎండీ శ్రీనివాస్ రాజుతో మాట్లాడి కోళ్ల పెంపకం ఎలా ఉంది? లాభాలు వస్తున్నాయా? కోళ్ల దానాకు సబ్సిడీ అందుతుందా? లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోళ్ల పెంపకం బాగుందని ఎండీ రాజును ప్రశంసించారు. ఆయనతో పాటు కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార
ఉన్నారు.