నీటి మట్టం 150 అడుగులకు చేరితే విస్టా కాంప్లెక్స్‌‌ మునిగిపోతది : ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ

పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌‌ఆర్‌‌ఎల్‌‌) 150 అడుగులకు చేరితే భద్రాద్రి రామాలయానికి చెందిన విస్టా కాంప్లెక్స్‌‌ మునిగిపోతుందని ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ పేర్కొంది.

హైదరాబాద్‌‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌‌ఆర్‌‌ఎల్‌‌) 150 అడుగులకు చేరితే భద్రాద్రి రామాలయానికి చెందిన విస్టా కాంప్లెక్స్‌‌ మునిగిపోతుందని ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ పేర్కొంది. అలాగే, 892 ఎకరాలు ముంపునకు గురవుతాయని చెప్పింది. దీనికి సంబంధించి ఈఎన్సీ (ఓఅండ్‌‌ఎం) నాగేందర్‌‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ పోలవరం వరద ప్రభావంపై శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ శుక్రవారం జలసౌధలో ఈ నివేదికపై ఇంజినీర్లతో సమీక్షించారు. విస్టా కాంప్లెక్స్‌‌తో పాటు కొత్త కాలనీ, ఏటపాక నీటితో బ్లాక్‌‌ అవుతాయని నివేదించారు. బూర్గంపాడు, పాల్వంచ, అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాల్లోని 892 ఎకరాలు మునిగిపోతాయని తెలిపారు. ప్రాజెక్టులో మునిగిపోయే ఈ భూములకు పరిహారం ఇవ్వాలని సూచించారు. పోలవరంలో గరిష్టంగా నీటిని నిల్వ చేస్తే, 31 వాగుల నీళ్లు గోదావరిలో కలవకుండా వెనక్కి వస్తాయని, భూములు ముంపునకు గురవుతాయని చెప్పారు. భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలు, బూర్గంపాడు, సారపాక ముంపునకు గురవకుండా ప్రత్యేక పంపింగ్‌‌ సిస్టం ఏర్పాటు చేయాలని కమిటీ రికమెండ్‌‌ చేసింది. పోలవరం ముంపుతో పాటు గోదావరి వరదలు, నష్ట నివారణ చర్యలపై నవంబర్‌‌ 6వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని స్పెషల్‌‌ సీఎస్‌‌ కమిటీని ఆదేశించారు. 

అన్ని ప్రాజెక్టుల మెయింటనెన్స్‌‌ ఆన్‌‌లైన్‌‌లోనే..

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల ఆపరేషన్స్‌‌ అండ్‌‌ మెయింటనెన్స్‌‌ ఇకపై ఆన్‌‌లైన్‌‌లోనే నిర్వహించాలని ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిర్ణయించింది. దీనిపై జలసౌధలో రజత్‌‌ కుమార్‌‌ రివ్యూ చేశారు. ప్రస్తుతం కాళేశ్వరంలో అమల్లో ఉన్న రియల్‌‌ టైం డేటా అక్విజేషన్‌‌ సిస్టంను ఇకపై అన్ని ప్రాజెక్టుల్లోనూ ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 75 పంపుహౌస్‌‌లు, ఇంకో 75 మేజర్‌‌, మీడియం రిజర్వాయర్లను స్కాడా సిస్టంతో లింక్‌‌ చేయనున్నారు. ఇందుకోసం వాసర్ల ల్యాబ్‌‌తో ఒప్పందం చేసుకున్నారు. వచ్చే వాటర్‌‌ ఇయర్‌‌లోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎగువ నుంచి వరద వచ్చే పరిస్థితుల్లో అనవసరంగా పంపులు రన్‌‌ చేసి, కరెంట్‌‌ చార్జీల భారం వేయకుండా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.