Madhya Pradesh: వీళ్లసలు మనుషులేనా.. ఇద్దరు మహిళలను బతికుండగానే పాతి పెట్టేయాలని చూశారు..!

Madhya Pradesh: వీళ్లసలు మనుషులేనా.. ఇద్దరు మహిళలను బతికుండగానే పాతి పెట్టేయాలని చూశారు..!

భోపాల్: మధ్యప్రదేశ్ అమానుష ఘటన జరిగింది. బతికుండగానే ఇద్దరు మహిళలను పూడ్చి పెట్టి చంపేయడానికి గూండాలు ప్రయత్నించారు. సగానికి పైగా మట్టితో పూడ్చేశారు కూడా. స్థానికులు ఆ ఇద్దరినీ కాపాడటంతో మహిళలు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్ లో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు నిలదీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా హినౌతాలో భూ వివాదం ఇద్దరి మహిళలకు ప్రాణాల మీదకు తెచ్చింది. రోడ్డు కన్స్ట్రక్షన్లో భాగంగా మమతా పాండే, ఆశా పాండే ఇద్దరు మహిళలకు చెందిన భూమి చిక్కుల్లో పడింది.

రోడ్డు తమ పొలం మీదుగా వేయడాన్ని తాము ఒప్పుకోమని, తమ భూమిని కోల్పోవాల్సి వస్తుందని ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ను సదరు మహిళలు అడ్డుకున్నారు. రోడ్డు వేస్తున్న వారు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడమే కాకుండా స్థానిక గూండాల అండచూసుకుని ఏకంగా ఆ మహిళలిద్దరినీ బతికుండగానే పూడ్చి పెట్టే ప్రయత్నం చేశారు. డంపర్ ట్రక్ డ్రైవర్ మట్టిని తీసి నిల్చుని ఉన్న ఈ ఇద్దరు మహిళలను సగానికి పైగా మట్టితో కప్పెట్టేశాడు. స్థానికులు ఈ గొడవను గమనించి గుంపుగా రావడంతో గూండాలు వెనక్కి తగ్గారు.

Also Read:-బీహార్‌కు ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం.. ఏపీకి కూడా చెప్పేసినట్టేనా..!?

మమతా పాండే, ఆశా పాండే కుటుంబ సభ్యులు వీరిని కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతటి అమానుషానికి పాల్పడిన డంపర్ డ్రైవర్ ప్రదీప్ కోల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఏడీజీ శ్రీ జైదీప్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఘటనలో సామాజిక వర్గ కోణం ఉందనడం అవాస్తవమని, ఆ మహిళలు ఇద్దరూ పాండే వర్గానికి చెందిన వారని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియా భగ్గుమంది. 2024లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని నెటిజన్లు నిలదీశారు. మధ్యప్రదేశ్లో శాంతిభద్రతలు మరీ ఇంత అధ్వానంగా ఉండటంపై ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.