వీడియో: భారత్‌ను భయపెడుతోన్న ఆఫ్రిదీ ఫామ్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు

వీడియో: భారత్‌ను భయపెడుతోన్న ఆఫ్రిదీ ఫామ్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు

పాకిస్తాన్ స్పీడ్‌స్టర్, మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రీదీ అల్లుడు.. షాహీన్ ఆఫ్రిదీ భీకర ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ఆఫ్రిదీ.. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతోన్న విటలిటీ టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు. నాటింగమ్‌షైర్ క్లబ్‌కు ఆడుతున్న షాహీన్ ఆఫ్రిదీ, వార్‌విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 చరిత్రలో మొదటి ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు.. అయినా ఓటమి

తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగమ్‌షైర్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 168 పరుగులు చేసింది. టామ్ మూర్స్ 73(42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. అనంతరం 169 పరుగుల లక్ష్య చేధనకు వార్‌విక్‌షైర్‌ షాహీన్ ఆఫ్రిదీ ధాటికి తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు కోల్పోయింది. 

మొదటి బంతికి అలెక్స్ డేవిస్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా, రెండో బంతికి క్రిస్ బెంజిమన్‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడు, నాలుగు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. ఆ తర్వాత మౌస్లే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. ఆఖరి బంతికి బర్నార్డ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ.. వార్‌విక్‌షైర్‌ లక్ష్యాన్ని చేధించింది. రాబర్ట్ యేట్స్ 65 (46 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) ఒంటరి పోరాటం చేశాడు. నాటింగమ్‌షైర్ బౌలర్లలో అఫ్రిదీ 4 వికెట్లు తీయగా.. జేక్ బాల్ 3 వికెట్లు పడగొట్టాడు.

?Shaheen Afridi has taken four wickets in his first over!?#Blast23 #ShaheenAfridipic.twitter.com/3Aal6oIKSi

— Cricket Videos ? (@Abdullah__Neaz) June 30, 2023

టీమిండియాకు ఆఫ్రిదీ గండం

పాకిస్తాన్ పేస్ దళాన్ని ముందుండి నడిపించే ఆఫ్రిదీని తేలిగ్గా తీసుకోలేం. 2021 ప్రపంచ కప్ లో టీమిండియా ఓటమిని ఆఫ్రిదీ ఒక్కడే శాసించాడు. ఆఫ్రిదీ దెబ్బకు రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరగగా.. కెఎల్ రాహుల్ 1 పరుగుకే పెవిలియన్ చేరాడు.ఆపై హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ కూడా ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 151 పరుగులే కుప్పకూలింది. అనంతరం పాక్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఆఫ్రిదీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 

అనంతరం గాయంతో కొన్నాళ్ళు క్రికెట్‌కు దూరమైన ఆఫ్రిదీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కానీ ప్రస్తుతం అతడు రాణించడం చూస్తుంటే మళ్ళీ మునుపటి లయ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. దీంతో అతని నుంచి టీమిండియాకు మరోసారి గండం పొంచి ఉంది అన్న కామెంట్లు వినపడుతున్నాయి.