
డి-విటమిన్ లోపం అంటే ఎవరికీ పట్టదు. హా ఏముందిలే కాసేపు ఎండలో నిల్చుంటే వస్తుంది అనుకుంటుంటారు చాలా మంది. కానీ డి-విటమిన్ లోపం ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ విటమిన్ లోపంతో తీవ్రమైన అనారోగ్యం బారిన పడిన వారు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ఇది చాపకింద నీరులా మరింత విస్తరిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం భారీ మూల్యానికి కారణమవుతుందని అంటున్నారు. ఇటీవల జరిపిన సర్వే ప్రకారం హైరిస్క్ లో ఉన్న కొన్ని ఏజ్ గ్రూప్స్ ను రిలీజ్ చేశారు. వాళ్లు ఎంత రిస్క్ లో ఉన్నారో ఈ ఆర్టికల్ చదివితే అర్థం అవుతుంది.
ఇటీవల ICRIER పరిశోధన సంస్థ, ANVKA ఫౌండేషన్ కలిసి ఇండియాలో డి-విటమిన్ డెఫిషియెన్సీపై అధ్యయనం జరిపారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో లెవల్ లో ఈ సమస్య ఉందని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో 39 శాతం ప్రజలు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ సందర్భంగా దేశంలో ఏ ఏ వయసు వాళ్లు ఈ లోపంతో బాధపడుతున్నారు, వారికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందో డా.ఆకాశ్ చౌదరి (ఆకాశ్ హెల్త్ కేర్) చెప్పిన మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆకాశ్ చౌదరీ చెప్పిన వివరాల ప్రకారం.. విటమిన్-డి లోపం సైలెంట్ గా విస్తరించే వ్యాధి. అందరూ అనుకున్నట్లుగా ఇది కేవలం ఎముకలకు సంబంధించిన లోపమే కాదు.. శరీరంలోని రోగనిరోధక శక్తిని తీవ్రగం ప్రభావితం చేసే వ్యాధిగా ఆయన చెప్పారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, దేశ ఆరోగ్య శాఖకు, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అంశమని అన్నారు.
అత్యంత ప్రమాదంలో ఉన్న గ్రూపులు:
విటమిన్-డి లోపంతో ప్రమాదంలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు (Children), కౌమారదశ (adolescents), గర్భిణీలు (pregnant women), వృద్ధాప్యంలో ఉన్న వారు డి-విటమిన్ సమస్యకు గురవుతున్నారని, వారిలో తీవ్ర ప్రభావం చూపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే పురుషులతో పోల్చినపుడు స్త్రీలలో ఈ సమస్య ఎక్కువని, గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉందని తెలిపారు.
Also Read : ప్రతి కథలో కన్నీళ్లు ఉంటాయ్
డి-విటమిన్ లోపంతో ఏంటి ప్రమాదం:
ఇప్పటి వరకు విటమిన్ డి లోపం అంటే అందరికీ గుర్తొచ్చేది ఎముకల సమస్య. ఎముకలు దృఢత్వం తగ్గి మెత్తబడిపోతాయని అందరూ అనుకుంటారు. కానీ అది ప్రాథమిక దశ మాత్రమేనని అంటున్నారు వైద్యులు. ఎముకలకే కాకుండా మొత్తం శరీరంపై ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ లోపంతో పిల్లల్లో ‘రికెట్స్’ (ఎముకలు మెత్తబడి వంగి పోవడం) వ్యాధి, పెద్దలలో ‘ఆస్టియోమలాసియా’ (ఎముకలు మెత్తబడి విరిగిపోవడం) వ్యాధులు వస్తాయని పరిశోధకులు తెలిపారు. వీటితో పాటు కండరాల బలహీనత, అలసట, ఉన్నట్లుండి మూడ్ చేంజ్ కావడం, డిప్రెషన్ (ఒత్తిడి) పెరగటం జరుగుతుంటుంది. ఇది ఇంకా ముదిరితే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, క్యాన్సర్ కు కూడా కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
డి-విటమిన్ లోపం నుంచి ఎలా బయటపడాలి..?
విటమిన్-డి లోపం నుంచి బయటపడాలంటే ముందుగా ఆహారంలో పాలు, పెరుగు తప్పనిసరిగా చేర్చాలని సూచిస్తున్నారు వైద్యులు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య కచ్చితంగా ఎండలో ఉండాలి. డి-విటమిన్ లభించే ఆహార పదార్థాలు (ఆయిల్స్, ధాన్యాలు) ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఈ సమస్యను తరిమి కొట్టాలంటే భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు వైద్యులు. ప్రజలకు విటమిన్-డి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిసినప్పుడే వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు.