
విటమిన్లు శరీరానికి అతి తక్కువ మోతాదులో అవసరమయ్యే కర్బన పోషక పదార్థాలు. అందుకే వీటిని సూక్ష్మపోషకాలు అంటారు. వైటల్, అమైన్స్ అనే పదార్థాల నుంచి విటమిన్స్ అనే పదం రూపొందింది. 1912లో హెచ్.జి.హోప్కిన్స్ పాలల్లో గుర్తించిన పదార్థానికి అదనపు కారకం అని పేరు పెట్టి తదుపరి దానిని విటమిన్‌గా గుర్తించారు. విటమిన్ అనే పేరును కస్ మిర్ ఫంక్ సూచించారు.
కొవ్వులో కరిగే విటమిన్లు
విటమిన్ ఎ: దీని రసాయన నామం రెటినాల్. దీనిని యాంటిగ్జెరాఫ్తాల్మిక్, యాంటి ఇన్ఫెక్టివ్ విటమిన్ అని కూడా అంటారు. ఇది కంటి చూపునకు తోడ్పడుతుంది. మొక్కల్లో విటమిన్ ఎ కిరాటిన్ రూపంలో ఉంటుంది. కంటిలోని రెటీనాలో వర్ణ ద్రవ్యాలను ఏర్పరచడానికి తోడ్పడుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల చర్మం పొడి బారుతుంది. రే చీకటి, చత్వారం మొదలైన కంటి సమస్యలు తలెత్తుతాయి.
లభించే పదార్థాలు: క్యారెట్, ఆకు కూరలు, టమాట, గుమ్మడి, బత్తాయి, మామిడి, చేపలు, గుడ్లు, పాలు, కాడ్, షార్క్ చేపల కాలేయం నుంచి లభించే నూనెల్లో ఇది లభిస్తుంది.
విటమిన్ డి: రసాయన నామం కాల్సిఫిరాల్. దీన్ని సన్‌షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, యాంటి రికెటింగ్విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్ అని కూడా అంటారు. సూర్యరశ్మి ద్వారా ప్రసారమయ్యే అతినీలలోహిత కిరణాలు శరీరంలోని కొలెస్టిరాల్‌ను విటమిన్ డిగా మారుస్తాయి. ఎముకలు ఏర్పడటానికి, ఎముకలు గట్టి పడటానికి ఇది తోడ్పడుతుంది. చిన్న పిల్లల్లో ఈ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి, పెద్ద వారిలో ఆస్ట్రియో మలేషియా, ఆస్టియో పొరాసిస్ వ్యాధులు వస్తాయి.
లభించే పదార్థాలు: కాడ్, షార్క్ చేపల కాలేయం నుంచి లభించే నూనెల్లో, కాలేయం, గుడ్లు, వెన్న, పాలల్లో లభిస్తుంది.
విటమిన్ ఈ: రసాయన నామం టోకోఫిరాల్. దీనిని బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణ, ముఖంపై ముడతలు రాకుండా ఇది తోడ్పడుతుంది. యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీల్లో గర్భస్రావం, ఎర్ర రక్తకణాల క్షీణత కలుగుతుంది.
లభించే పదార్థాలు: ఆకు కూరలు, మాంసం, పాలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు, పొద్దు తిరుగుడు పువ్వు నూనె, సోయా చిక్కుడు, పత్తి గింజలు, చిలగడ దుంప
విటమిన్ కె: రసాయన నామం ఫైలోక్వినోన్. దీనిని రక్త స్కంధన విటమిన్, యాంటి కోయాస్యలేషన్ విటమిన్ అంటారు. రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని లోపం వల్ల రక్త గడ్డ కట్టడం ఆలస్యమవుతుంది. మాంసం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, ముఖ్యంగా ఆవు పాలల్లో ఇది సమృద్ధిగా లభిస్తాయి.
నీటిలో కరిగే విటమిన్లు
విటమిన్ బి1: రసాయన నామం థయామిన్. దీన్ని యాంటీ న్యూరైటిస్ విటమిన్ అని కూడా అంటారు. తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లలో లభిస్తాయి.
విటమిన్ బి2: రసాయన నామం రైబోఫ్లెవిన్. ఎల్లో విటమిన్ అని కూడా అంటారు. ఆవు పాలు లేత పసుపురంగులో ఉండటానికి కారణం బి2. దీనిలోపం వల్ల గ్లాఫైటిస్ వ్యాధి కలుగుతుంది. నోటిపూత, వెలుతురులో చూడలేకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఆకు కూరలు, పాలు, గుడ్లు, జీడి మామిడి, బాదాం పప్పు, రాగుల్లో లభిస్తాయి.
విటమిన్ బి3: రసాయన నామం నియాసిన్ లేదా నికోటినికామ్లం. దీన్ని యాంటి పిల్లాగ్రా విటమిన్. సుస్థిర విటమిన్ అంటారు. ఇది ఏడీపీ, ఎన్ఏడీపీ సంయోగాల తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి కలుగుతుంది. చర్మం పొలుసులుగా మారుతుంది. చేపలు, గుడ్లు, నూనెగింజలు, ముల్లంగి, బఠాణీలో లభిస్తాయి.
విటమిన్ బి5: రసాయన నామం ఫాంటోథెనికామ్లం. దీనికి మరో పేరు సర్వవిస్తృత విటమిన్. లోపం వల్ల అరికాళ్ల మంటలు ఏర్పడతాయి.
విటమిన్ బి6: రసాయన నామం ఫైరిడాక్సిన్. దీనిని యాంటి అనిమీయా విటమిన్ అని కూడా అంటారు. ఆమైనో ఆమ్లాలు, హీమోగ్లోబిన్ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత సంభవిస్తుంది. తృణధాన్యాలు, నూనె గింజలు, గోధుమ, దంపుడు బియ్యం, పాలు, గుడ్లు, చేపల్లో లభిస్తాయి.
విటమిన్ బి7: రసాయన నామం బయోటిన్. దీనికి మరో పేరుతో H విటమిన్ అని కూడా అంటారు. ఆమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు జీవక్రియలో తోడ్పడుతాయి. పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ బి7ను కోల్పోతుంది. దీనిలోపం వల్ల కండరాల నొప్పులు, అలసట వస్తాయి. పప్పుధాన్యాలు, గింజలు, సోయా చిక్కుడు, టమాటలో లభిస్తాయి.
విటమిన్ బి9: దీని రసాయన నామం ఫోలికామ్లం. దీన్ని ఎం విటమిన్ అని కూడా అంటారు. న్యూక్లికామ్లాలు(డీఎన్ఏ, ఆర్ఎన్ఏ) సంశ్లేషణలో ఇది తోడ్పడుతుంది. దీనిలోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. పాలు, మాంసం, గుడ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు, గోధుమ, మొక్క జొన్నలో లభిస్తాయి.
విటమిన్ బి12: దీని రసాయన నామం సయానోకోబాలమిన్. దీనికి మరో పేరు యాంటీ ఫెర్నీషియస్ విటమిన్ అంటారు. న్యూక్లికామ్లాల సంశ్లేషణలో ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది.
విటమిన్ సి: రసాయన నామం ఆస్కార్బికామ్లం. దీన్ని యాంటిస్కర్వీ విటమిన్ అని కూడా అంటారు. వేడిచేస్తే ఈ విటమిన్ నశిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి, డెంటిన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. ఆకు కూరలు, పుల్లని పండ్లు, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మోతాదులో జామలో లభిస్తాయి.
విటమిన్లను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు. శరీరానికి విటమిన్లు రెండు మార్గాల ద్వారా అందుతాయి.1. మనం తీసుకునే ఆహారం ద్వారా 2. జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు విటమిన్లను సంశ్లేషిస్తాయి. అందువల్ల సాధారణంగా మనం విటమన్ల లోపానికి గురికావడం జరగదు.
కరిగే స్వభావాన్ని బట్టి విటమిన్లను రెండు రకాలుగా వర్గీకరించారు.
1. కొవ్వులో కరిగే విటమిన్లు: A, D, E, K
2. నీటిలో కరిగే విటమిన్లు: B కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి