న్యూఢిల్లీ: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై కాంగ్రెస్ విరుచుకుపడింది. వివేక్ అగ్నిహోత్రి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫిలీం మేకర్ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ ఆరోపించారు. 1984 అల్లర్ల (సిక్కుల ఊచకోత) నేపథ్యంలో తన రెండో సినిమా ఉంటుందని వివేక్ అగ్నిహోత్రి ఇటీవల ప్రకటించారు. వివేక్ ప్రకటనపై కాంగ్రెస్ నేత స్పందించారు. దమ్ముంటే గుజరాత్ ఫైల్స్ సినిమా తీయాలని సవాల్ విసిరారు. ‘గుజరాత్ అల్లర్ల సమయంలో రాష్ట్రం తగలబడుతుంటే అప్పటి ముఖ్యమంత్రి, హోం మంత్రి ఏమేమి చేశారో మొత్తం సమాచారం ఇస్తా. సాక్షాధారాలు కూడా అందిస్తా. దమ్ముంటే గుజరాత్ ఫైల్స్ అని సినిమా తియ్. కానీ నాకు తెలుసు. నువ్వు ఆ సినిమా తీయలేవని. ఎందుకంటే నీకు స్పాన్సర్ చేస్తోంది వాళ్లే కాబట్టి’ అని గౌరవ్ వల్లభ్ ఘాటుగా విమర్శించారు.
తనకు నచ్చిన ఏ అంశంపైననైనా సినిమా తీసే హక్కు ప్రతి దర్శకుడికి ఉంటుందని, వివేక్ అగ్నిహోత్రి నిజమైన దర్శకుడికైతే గుజరాత్ అల్లర్లపై సినిమా తీయాలని కోరారు. అప్పుడు గానీ ఆయన గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫిలిం మేకర్ కాదని ఒప్పుకుంటామని తెలిపారు. నిజమైన ఫిలిం మేకరెవరు కూడా పక్షపాత ధోరణితో సినిమాలు చేయరని స్పష్టం చేశారు.
కాగా.. కశ్మర్ ఫైల్స్ మూవీని బీజేపీ బాగా ప్రమోట్ చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ మూవీకి ట్యాక్స్ ను కూడా రద్దు చేశాయి. అయితే ప్రతి పక్ష నేతలు మాత్రం కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కశ్మీర్ పండిట్లను వాడుకుంటోందని మండిపడ్డారు. ‘మంచి సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ఎందుకు, యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు కదా’ అంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గతంలో వ్యాఖ్యానించారు.
మరిన్ని వార్తల కోసం...