వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి మంగళవారం ప్రకటించారు. అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంతో.. రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్‌ను పొగుడుతూ వచ్చిన వివేక్.. ఒకానొక సందర్భంలో తాను ఉపాధ్యక్షుడిగా అయినా కొనసాగేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఇటీవల వివేక్‌పై ట్రంప్ బహిరంగంగా ఆరోపణలు చేసినా.. అతను మాత్రం ‘21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్’ అంటూ కితాబిచ్చారు. తాజాగా అయోవా ప్రైమరీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవడంతో అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నానని, ట్రంప్ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటానని వెల్లడించారు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
అయోవా ఎన్నికల చరిత్రలో ఫస్ట్ టైమ్
రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించేందుకు అయోవా రిపబ్లికన్ కాకస్‌లో సోమవారం ఎన్నికలు జరిగాయి. ట్రంప్51 % ఓటింగ్‌తో ఘన విజయం సాధించారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్‌కు 21.2%, యూఎన్ మాజీ రాయబారి నిక్కీ హేలీకి 19.10% ఓట్లు పోలయ్యాయి. రామస్వామి మాత్రం 7.7% ఓటింగ్‌తో నాల్గో స్థానంలో నిలిచారు. అయోవాలోని మొత్తం 40 మంది ప్రతినిధుల్లో ట్రంప్‌కు అనుకూలంగా 20 మంది ఓటేశారు. కాగా, రిపబ్లికన్ పార్టీలో ఇంత భారీ మెజార్టీ సాధించడం అయోవా ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి. 1988లో దివంగత సెనేటర్ బాబ్ డోల్ 12.80% మార్జిన్.. ఇప్పటి దాకా హయ్యెస్ట్. రిపబ్లికన్ ప్రైమరీ సీజన్లో మొత్తం 2,429 మంది డెలిగేట్స్ ఉన్నారు. వీరిలో 1,215 మంది ప్రతినిధుల మద్దతు కూడగట్టుకున్నవాళ్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగుతారు.
అందరిని కలుపుకుని ముందుకెళ్తా: ట్రంప్
అయోవా నుంచి భారీ మద్దతు లభించడం సంతోషం గా ఉందని మాజీ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. రిజల్ట్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు మద్దతుగా నిలిచి వారందరికీ థ్యాంక్స్. అందరిని కలుపుకుని ముందుకెళ్తాను. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను” అని ట్రంప్ చెప్పారు.