కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా మునుగోడులో గెలిచేది రాజగోపాల్ రెడ్డే

చండూరు (మర్రిగూడ) వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఎన్నికల ఇన్‌‌చార్జి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమానికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మునుగోడులో బీజేపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మునుగోడు బైపోల్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా మునుగోడులో గెలిచేది రాజగోపాల్ రెడ్డేనని అన్నారు. ప్రజల మద్దతు రాజగోపాల్‌‌కే ఉందని, నియోజకవర్గ ప్రజలు ఏకతాటి పైకి వచ్చి ఆయన్ను గెలిపించాలని కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. తర్వాత పార్టీలో చేరిన నాయకులతో.. బీజేపీ గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.

వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో చేరికలు

వివేక్ వెంకటస్వామి శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలానికి మొదటిసారిగా వచ్చిన నేపథ్యంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి సమక్షంలో సరంపేట, తమ్మడపల్లి గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, రాజగోపాల్ రెడ్డి అభిమానులు బీజేపీలో చేరారు. 

నేడు రాష్ట్రానికి సునీల్ బన్సల్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇటీవల రాష్ట్ర (సంస్థాగత) ఇన్​చార్జ్​గా నియమితులైన సునీల్ బన్సల్ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. పార్టీ స్టేట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో తాజా రాజకీయాలపై చర్చించ నున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు వ్యూహం, సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఆదివారం పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో కలిసి మునుగోడు ప్రచారంలో పాల్గొననున్నారు. అక్కడ పార్టీ నేతలతో జరిగే సమావేశాలకు హాజరవుతారు.