కోల్ బెల్ట్, వెలుగు : తెలంగాణలో కేసీఆర్ పాలన ముగిసిందని పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని, అందులోకి ఎవరూ వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఒడ్డేపల్లి, బుద్ధారం, కన్నెపల్లి, లంబాడీపల్లె తండా, ఎల్లక్కపేట, సుద్దాల, తుర్కపల్లి, కిష్టంపేట గ్రామాల్లో వివేక్ పర్యటించారు. కర్నాటకలోని జగుళూర్ ఎమ్మెల్యే దేవేందరప్పతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ప్రజలు, నాయకులను నమ్మించి గొంతు కోయడం సీఎం కేసీఆర్‌కు అలవాటేనని విమర్శించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దండుకుంటే, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇసుక దందాతో రూ.2 వేల కోట్లు వెనకేసుకున్నారు.
జనం సొమ్ముతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న కేసీఆర్.. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ఇండ్లు మాత్రం కట్టించలేదు. తన కోసం మహల్లాంటి ప్రగతి భవన్ కట్టుకున్నారు. సీఎం కుటుంబసభ్యుల ఫామ్‌హౌస్‌లపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిలదీస్తే జైలులో వేయించారు. తన సొంతూరులో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చిన కేసీఆర్.. తన కుటుంబ సభ్యుడు, చిన్న కొడుకు అని చెప్పుకుంటున్న బాల్క సుమన్ నియోజకవర్గమైన చెన్నూరులో మాత్రం ఎందుకు ఇవ్వలేదు. చెన్నూరు ప్రజలు ఏం పాపం చేశారు” అని ప్రశ్నించారు. కేసీఆర్, బాల్క సుమన్‌కు అభివృద్ధి అవసరం లేదని.. ప్రతి పనిలో 30 శాతం కమీషన్ వస్తే చాలనుకుంటారని విమర్శించారు.
సుమన్ చేసిన అభివృద్ధేం లేదు..
చెన్నూరులో బాల్క సుమన్ చేసిన అభివృద్ధేం లేదని వివేక్ విమర్శించారు. ఆయన ఇసుక, బొగ్గు దందాతో రూ.కోట్లు కొల్లగొట్టాడని ఆరోపించారు. ‘‘సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్పేరుతో చేసింది అభివృద్ధి కాదు. చెన్నూరులో కట్టించిన హాస్పిటల్లో డాక్టర్లు లేరు. కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో వేల ఎకరాల్లో పంటలు మునిగినా పట్టించుకోలేదు. బుద్ధారంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి” అని మండిపడ్డారు. ఏదైనా పని కోసం ప్రజలు వెళ్తే, సుమన్కనీసం కలవడని ఫైర్ అయ్యారు.
‘‘నేను అధికారంలో లేకున్నా విశాక ట్రస్ట్ ద్వారా చెన్నూరు ప్రజలకు సేవలు అందించాను. నన్ను చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాను. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలు బాగుపడతాయి. వచ్చే 5 ఏండ్లలో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది. బాల్క సుమన్ ఇస్తున్న రూ.5 వేలు తీసుకుని, చేతి గుర్తుకే ఓటు వేయండి” అని వివేక్ కోరారు.
భయపడొద్దు.. నేనున్న
బాల్క సుమన్ కు చెన్నూరులో ఓడిపోతాననే భయం పట్టుకుందని, అందుకే బట్టలూడదీస్తానంటూ సభ్యత లేకుండా మాట్లాడుతున్నాడని వివేక్ మండిపడ్డారు. ‘‘నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పెరిగిన ఆదరణ చూసి సుమన్ తట్టుకోలేకపోతున్నడు. అందుకే సొంత పార్టీ లీడర్లనే బెదిరిస్తున్నడు. కాంగ్రెస్ చేపట్టిన బైక్ ర్యాలీ సక్సెస్ కావడంతో సుమన్‌కు ఏమీ తోచడం లేదు. యూత్‌కు బీరు, బిర్యానీలు ఇచ్చి మభ్య పెట్టే ప్రయత్నాలు షురూ చేసిండు. ఓట్ల కోసం లీడర్లకు ప్యాకేజీలు ఇస్తున్నడు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన రాజా రమేశ్, బోడ జనార్దన్, అందుగుల శ్రీనివాస్ ను కొనేశాడు. బాల్క సుమన్ఎన్ని చేసినా ప్రజలు కాంగ్రెస్‌వైపే ఉన్నారు” అని అన్నారు.
‘‘16 రోజులు ఓపిక పట్టండి. సుమన్ గూండాయిజం చూసి భయపడొద్దు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రావని టెన్షన్ పడొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం కాగానే అన్నీ క్లియర్చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. ప్రజలే సుమన్ బట్టలు విప్పి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్, బాల్క సుమన్ జైలుకు వెళ్లడం ఖాయం. మీకు అండగా నేను ఉంటాను. ధైర్యంగా ముందుకు సాగుదాం. బాల్క సుమన్ బాధి తులకు అండగా నిలుద్దాం” అని కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలకు వివేక్ భరోసా ఇచ్చారు.
5 వేలు కావాలా.. 10 లక్షలు కావాలా? కాంగ్రెస్ పాలనలోనే తాగునీళ్లు,
పేదలకు ఇండ్లు వచ్చాయని వివేక్ అన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కు తుందన్నా రు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని చెప్పారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో ఈ ఎన్నికల్లో అవినీతిపరులను దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. ఓటు కోసం బీఆర్ఎస్ఇచ్చే రూ.5 వేలు కావాలో.. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి కుటుంబా నికి అందే రూ.10 లక్షల ప్రయోజనం కావాలో ఆలోచన చేయాలని సూచించారు. కాగా, అంతకుముందు చెన్నూరు అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ఆఫీసును వివేక్ ప్రారంభించారు.