- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు ఎందుకియ్యరు?: వివేక్ వెంకటస్వామి
లక్సెట్టిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే రూ. లక్షల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, డబుల్ బెడ్రూం ఇండ్లకు మాత్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఓ కాలేజీ గ్రౌండ్ లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం నిరుపేదల కోసం 9 ఏండ్లలో 4 కోట్ల ఇండ్లు కట్టించిందని, మరి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిందో చెప్పాలన్నారు. ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని మీటింగుల్లో చెప్పారని, ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఇంటింటికి తాగునీరు ఇస్తామని చెప్పి ఇచ్చారా? అని అడిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.10 తక్కువగా ఉంటే మన రాష్ట్రంలో రూ.10 ఎక్కువగా ఉన్నాయన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే బస్ చార్జీలను పెంచి పేదల నడ్డి విరిచారన్నారు. కరోనా సమయంలో ఎన్నో దేశాల జీడీపీ గ్రోత్ పడిపోతే మనదేశంలో మాత్రం 6.8 జీడీపీ గ్రోత్ నమోదైందని, ఇదంతా మోదీసర్కారు ఘనత అని చెప్పారు. అలాగే 200 కోట్ల టీకాలు ఉచితంగా అందించడమే కాకుండా కరోనా సమయంలో ప్రజల కోసం కేంద్రం ఎంతో చేసిందని వివేక్ అన్నారు. ఉజ్వల స్కీంలో మహిళలకు ఫ్రీ గ్యాస్ ఇచ్చారని, ఉపాధి హామీ కూలీ రూ.187 ఉంటే.. దానిని రూ.212కు పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తుంటే, రాష్ర్ట ప్రభుత్వం తన వాటా రేషన్ ను కట్చేసిందన్నారు. మోదీ దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే కేసీఆర్ తన ఇంటిల్లిపాదికి ఫామ్ హౌస్ లు కట్టుకుంటున్నారు తప్ప పేదలకు ఇండ్లు కట్టడంలేదన్నారు.