
- టీఆర్ఎస్ కౌరవ సైన్యాన్ని ఓడిస్తం
- మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తం: వివేక్
- అత్యంత అవినీతిపరుడు కేసీఆర్
చౌటుప్పల్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కౌరవ సైన్యాన్ని ఓడిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘మునుగోడులో గెలవడానికి 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులను కేసీఆర్ రంగంలోకి దింపారు. టీఆర్ఎస్ కౌరవ సైన్యాన్ని ఎదుర్కోవడానికి మా పాండవుల సైన్యం సిద్ధంగా ఉంది. టీఆర్ఎస్ను ఓడించి బీజేపీ జెండా ఎగరేస్తం” అని ధీమా వ్యక్తం చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
వివేక్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ను మించిన అవినీతిపరుడు దేశంలోనే లేరు. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడే కేసీఆర్ దృష్టి పెడతారు. అందుకే ఆయనను అందరూ కల్వకుంట్ల కమీషన్‌రావు అని పిలుస్తున్నారు” అని విమర్శించారు. మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకులకు రంగేసి రూ.40 వేల కోట్లు దిగమింగారని ఆరోపించారు. మరో రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో తిరగడానికి ప్రజల సొమ్ము రూ.100 కోట్లు ఖర్చు చేసి విమానం కొంటున్నరు. రాష్ట్ర పైసలను ఇతర రాష్ట్రాల్లో పంచిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కేసీఆర్ తుగ్లక్ డిజైన్ల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నీటిలో మునిగిపోయింది. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలి” అని పిలుపునిచ్చారు.
ఇయ్యాల చౌటుప్పల్ కు కేంద్ర మంత్రి భూపేంద్ర
ఆదివారం చౌటుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న గొల్లకురుమల కార్యకర్తల సమావేశానికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ హాజరవుతారని వివేక్ చెప్పారు. ఇందులో పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర చీఫ్ సంజయ్ పాల్గొంటారని తెలిపారు. గొల్లకురుమలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తాడిచర్ల మైన్స్ కేటాయింపులపై సీబీఐ విచారణకు సిద్ధమా?
మంత్రి కేటీఆర్ కు వివేక్ వెంకటస్వామి సవాల్
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే రాజగోపాల్ రెడ్డి ఒడిశాలో బొగ్గు గనుల కాంట్రాక్టు దక్కించుకున్నారని చెప్పారు. బొగ్గు గనుల వేలంపై మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘మునుగోడు నియోజకవర్గ ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. హుజూరాబాద్, దుబ్బాకలో మాదిరిగానే మునుగోడులోనూ సొంత కార్యకర్తలను కొనుక్కోవాల్సిన దుస్థితిలో టీఆర్‌ఎస్ ఉంది” అని విమర్శించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మునుగోడు ఉప ఎన్నికపై ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా నియమితులైన లక్ష్మణ్, పార్టీ సంస్థాగత కార్యదర్శి, రాష్ట్ర ప్రబరిగా నియమితులైన సునీల్ బన్సల్, సహ ప్రబరీ అర్వింద్ మీనన్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు దమ్ముంటే తాడిచర్ల మైన్స్ కేటాయింపులపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. కమీషన్ల కోసమే ఈ బ్లాక్‌లను ఏఎంఆర్ సంస్థకు కేసీఆర్ సర్కారు అప్పగించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రూ.20 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. కాగా, రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌కు తరుణ్‌చుగ్, బండి సంజయ్ సహా ముఖ్య నేతలంతా హాజరవుతారని ఆయన తెలిపారు.