మంచిర్యాల : కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో పర్యటించిన ఆయన.. ముఖ్యమంత్రి వైఖరిపై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ మెఘా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే ధనవంతున్ని చేసి రైతులను పేదోళ్లను చేశాడని వివేక్ మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ఆస్తులను పెంచుకునేందుకు తప్ప ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం పని చేయడం లేదని అన్నారు.
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించకుండా తన కోసం 100 పడకల ప్రగతి భవన్, కొడుకు, కూతురు, అల్లుడికి ఫాంహౌస్ కట్టించుకున్నాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తన తండ్రి గడ్డం వెంకటస్వామి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెస్తే దాన్ని పక్కనబెట్టి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసి ఆ నీటిని ఫాం హౌస్ కు తరలించుకుంటున్నాడని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకంలో సీఎం భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆయన.. తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఖర్చుపెడుతూ కేసీఆర్ తన కొడుకును సీఎం చేయాలని చూస్తుండని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కారుకు పంక్చర్ చేసి బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు వివేక్ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న పుప్పాల రఘు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన 50 మంది నాయకులు బీజేపీలో చేరారు.