కాళేశ్వరం లెక్కాపత్రం బయటపెట్టాలె

కాళేశ్వరం లెక్కాపత్రం బయటపెట్టాలె

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇంత వరకు ఖర్చు చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి డిమాండ్​ చేశారు. ఈ ప్రాజెక్టుతో లక్ష కోట్లకుపైగా తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. లక్ష కోట్లు అప్పులు తెచ్చి కట్టిన ఈ మెగా ప్రాజెక్టుతో ప్రజలకు ఒక్క రూపాయి కూడా లాభం చేకూరలేదని ఆయన తెలిపారు. ‘‘కాళేశ్వరం కార్పొరేషన్​ పేరుతో తెచ్చిన లక్ష కోట్ల అప్పునకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత వడ్డీలు కట్టిందో బయటపెట్టాలి.  రీడిజైనింగ్​ పేరిట కేసీఆర్​ సొంత ఆలోచనతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది” అని బుధవారం ఒక ప్రకటనలో వివేక్​ వెంకటస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ఖర్చెంత.. కట్టిన వడ్డీ ఎంత?
‘‘గడిచిన నాలుగేండ్లలో కాళేశ్వరానికి తెచ్చిన అప్పులపై దాదాపు రూ. 30 వేల కోట్ల వడ్డీని ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. ఇదంతా ప్రజల ధనం కాదా..?’’ అని  ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఇంతవరకు పెట్టిన ఖర్చు, వడ్డీలు, కరెంటు బిల్లులు, ఇప్పుడు వరదలో పంపుహౌస్​లు మునగటంతో వాటిల్లిన నష్టంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు గోదావరిలో మునిగిపోతే.. నెల రోజులైనా కేసీఆర్​ ఎందుకు సమీక్ష జరపడంలేదని ఆయన ప్రశ్నించారు. వరదలో కొట్టుకుపోయిన పంపులు, దెబ్బతిన్న నిర్మాణాలకు ఎంత నష్టం జరిగిందో వెల్లడించకుండా.. అక్కడికి వెళ్లేవాళ్లను అడ్డుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్​ వాటర్ తో వేలాది ఎకరాల్లో పంటలు కోల్పోయిన ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని వివేక్​ వెంకటస్వామి డిమాండ్​ చేశారు.