కేసీఆర్ అహంకారాన్ని దించేందుకు ఇదే కరెక్ట్ ​టైం : వివేక్​వెంకటస్వామి

  • బీఆర్ఎస్​ను ఇంటికి పంపాలంటే చేతి గుర్తుకే ఓటెయ్యాలి: వివేక్
  • సింగరేణి నిధులు కేసీఆర్​ఫ్యామిలీ మెంబర్స్ సెగ్మెంట్లకు వెళ్తున్నయ్​
  • జైపూర్​ప్లాంట్​లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయి బాల్క సుమన్​కు లేదు 
  • చెన్నూరుకు మైనింగ్​ఇనిస్టిట్యూట్​ తెచ్చి.. ఉద్యోగాలు కల్పిస్తానని వెల్లడి

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు:  సీఎం  కేసీఆర్​ అహంకారాన్ని దించేందుకు ఇదే కరెక్ట్ టైం అని చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​ను, చెన్నూరులో బాల్క సుమన్​ను ఇంటికి పంపించాలంటే చేతి గుర్తుకే ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలంలోని రామారావుపేట, ఇందారం, టేకుమట్ల గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.  సింగరేణి కార్మిక ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్​టీ, సీఎస్సాఆర్​ ఫండ్స్.. ​సీఎం కేసీఆర్ ​కుటుంబ సభ్యుల నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, మెట్​పల్లి వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఇక్కడి నిధులను అక్రమంగా తరలిస్తున్నా ఎమ్మెల్యే బాల్క సుమన్​ అడ్డుకోలేదని మండిపడ్డారు. చెన్నూరు సింగరేణి సంస్థ మన ప్రాంతానికి గుండె కాయ వంటిదని.. సంస్థకు చెందిన వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం కాజేస్తున్నదని ఆయన ఫైర్​ అయ్యారు. కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో పంటలు మునిగితే కేసీఆర్ దత్తపుత్రుడు బాల్క సుమన్​కు పట్టించుకునే సోయి లేకుండా పోయిందన్నారు. ప్రపంచ మేధావిగా చెప్పుకుంటున్న కేసీఆర్​ కట్టించిన కాళేశ్వరంలో  ఆర్నెళ్ల ముందు మోటార్లు మునిగితే.. ఇప్పుడు పిల్లర్లు కుంగి ప్రాజెక్టు మనుగడ లేకుండా పోయే పరిస్థితి ఉందన్నారు. 

స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించి దండుకుండు

చెన్నూరు నియోజకవర్గంలోని సింగరేణి ఓసీపీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పైరవీలు చేసి.. డబ్బులు తీసుకొని బాల్క సుమన్, అతని అనుచరులు స్థానికేతరులకు జాబ్స్​​ఇప్పించారని వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. జైపూర్​ పవర్​ ప్లాంట్​ తన నాన్న కాకా వెంకటస్వామి చొరవతో ఏర్పాటైందన్నారు. ప్లాంట్​ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు, స్థానిక యువకులకు ఉద్యోగాలు రాలేదన్నారు.  బాల్క సుమన్​ పైరవీ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇసుక దందా, బొగ్గు దందా, ఓసీపీల్లో ఉద్యోగాల పైరవీలతో బాల్క సుమన్​ కోట్లు దండుకున్నాడని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జైపూర్​ పవర్​ ప్లాంట్​లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

రామారారావుపేట గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయిస్తానని, ఓసీపీతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు సహకరిస్తానని భరోసా కల్పించారు. జైపూర్ మండలంలో పంట నష్ట పోయిన బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. మైనింగ్​ ఇనిస్టిట్యూట్​ తీసుకొచ్చి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదేనని వివేక్​ వెంకటస్వామి అన్నారు. జైపూర్ లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. నా కోసం ఊరంత తరలిరావడం చూస్తే.. మీ ఆవేదన అర్థం అయిందన్నారు. జైపూర్ మండలంలో ఉన్న సమస్యలన్నీ నోట్ బుక్​లో రాసుకుంటున్నానని.. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే పరిష్కారిస్తానని చెప్పారు. ‘‘3వ తారీకు ఫలితాలు వస్తున్నాయి.. 5వ తేదీన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లతో అర్హులకు రూ.10 లక్షలు అందుతాయి” అని వివేక్​ అన్నారు. 

వివేక్​ వెంకటస్వామికి ఘన స్వాగతం

జైపూర్​మండలం రామారావుపేట, ఇందారం, టేకుమట్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వివేక్​వెంకటస్వామికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. వేలాది మంది ర్యాలీగా వచ్చారు. ప్రచారంలో సీనియర్ కాగ్రెస్ పార్టీ లీడర్లు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ ఫయాజ్, చల్ల సత్యనారాయాణరెడ్డి, టేకుమట్ల, రామారావుపేట సర్పంచులు గోనె సుమలత, నామాల సత్యవతి,  లింగారెడ్డి, లీడర్లు మూదం రమేశ్, నామాల తిరుపతి, గోనె నర్సయ్య, విశ్వంబర్ రెడ్డి, చందుపట్ల పాపి రెడ్డి పాల్గొన్నారు.

ఉద్యమకారులను కేసీఆర్​ మోసం చేసిండు: వివేక్ 

‘‘ఉద్యమకారులను కేసీఆర్​ మోసం చేసిండు.. ప్రొఫెసర్​ కోదండరాంను కూడా వాడుకొని.. అధికారంలోకి రాగానే వదిలేశాడు. కేసీఆర్​ చేతిలో మోసపోయిన వారిలో నేను ఒక బాధితుణ్ణి..” అని  వివేక్​ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి  మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీకృష్ణాఫంక్షన్​ హాల్​లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివేక్​ వెంకటస్వామి, కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడారు. చెన్నూర్​లో బాల్క సుమన్​ ఇసుక దందాతో వేయి కోట్లు దండుకున్నాడని, కేసీఆర్​ కాళేశ్వరం రీ డిజైన్​ పేరుతో రూ.70 వేల కోట్లను మింగాడని వివేక్ ఆరోపించారు.  

చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన బాల్క సుమన్ ఒకసారైనా రాలే అనే మాటే వినిపించిందన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా  ప్రజా సేవలోనే ఉంటానని, చెన్నూరు  ప్రజలకు అందుబాటులో ఉంటానని వివేక్​ హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే అసంపూర్తిగా మారిన లెదర్​ పార్క్​ను పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 

బీఆర్ఎస్‌ను ప్రజలు నిలదీస్తున్నరు : కోదండరాం

ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్​ చేయకపోవడంతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. ఇందుకు కేసీఆర్​ సర్కారే​ కారణమని టీజేఎస్​ ప్రెసిడెంట్​ కోదండరాం అన్నారు. పదేండ్లుగా బీఆర్​ఎస్​ సర్కార్​ ప్రజలకు ఏం చేసిందని జనం నిలదీస్తున్నారని చెప్పారు. ఉద్యోగం కోసం విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని అంటే.. ఎన్నికలపై ప్రభావం పడుతుందని యువతిపై మచ్చవేసి చేతులు  దులుపుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన అవమానాలన్ని గుర్తుపెట్టుకుని కేసీఆర్​ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. చెన్నూరు, బెల్లంపల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థులు వివేక్​ వెంకటస్వామి, గడ్డం వినోద్​ గెలుపు కోసం కృషి చేస్తామని కోదండరాం వెల్లడించారు.