మంచిర్యాల : రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్లో ఈ నెల 12న జరగనున్న ప్రధాని నరేంద్రమోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రామకృష్ణాపూర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభ ఏర్పాట్లుకు సంబంధించి స్థానిక నేతలతో చర్చించారు. సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. అంతకు ముందు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సంబంధించిన కరపత్రాలను వివేక్ వెంకటస్వామి విడుదల చేశారు. బెల్లంపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఎన్టీపీసీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను వివేక్ వెంకటస్వామి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి భగవంత్ ఖుబాతో కలిసి ఆయన సభాస్థలిని పరిశీలించారు.