- జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి
లక్సెట్టిపేట, వెలుగు : నిత్యం ప్రజాసేవలో ఉండేది ఒక్క బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ ప్రజల పార్టీ అని చెప్పారు. గురువారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఏర్పడిందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఐదు శాతం ప్రజల మద్దతు కూడగట్టుకుంటే గెలుపు మనదేనన్నారు. దీనికోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా కృషి చేయాలన్నారు.
కొవిడ్ కష్టకాలంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం అందించడమే కాకుండా రూ.45 వేల కోట్లు వెచ్చించి ఉచితంగా వ్యాక్సిన్లు అందజేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వల్ల ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందుతోందన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర హౌసా ఎమ్మెల్యే అభిమన్యు దత్తాత్రేయ పవార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, లీడర్లు రజనీష్ జైన్, బొప్పు కిషన్, హేమంత్‌రెడ్డి, తమ్మినేడి శ్రీనివాస్, బొప్పు సతీష్ తదితరులు పాల్గొన్నారు.