సీఎం కేసీఆర్ కు మునుగోడు ఉప ఎన్నిక భయం పట్టుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. అందుకే 80 మంది ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటే కేసీఆర్ ఎందుకంత భయపడుతున్నారని అన్నారు. ఇంటలిజెన్స్, సర్వే రిపోర్టుల్లో ఓడిపోతామని తెలిసే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వివేక్ వెంకస్వామి చురకలంటించారు. జాతీయ పార్టీ పేరుతో కేసీఆర్ డ్రామాలాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే మునుగోడులో పథకాలు అమలవుతున్నాయని, ఇక్కడ గెలుపు కోసమే కేసీఆర్ కొత్త కొత్త స్కీంలు తెస్తున్నారని అన్నారు. మునుగోడులో గెలిచేది బీజేపీయేనని సర్వేలు చెబుతున్నాయని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. నియోజకవర్గ మహిళలంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గెలుపు కోసం స్టీరింగ్ కమిటీ సభ్యులు మండల ఇంఛార్జులతో కలిసి పని చేస్తున్నామని వివేక్ వెంటస్వామి స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.