
- 54వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే: వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, వెలుగు: ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు 17 శాతం నుంచి 18 శాతం నిధులు కేటాయించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు 54 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు.
డీఎస్సీ ద్వారా 10 వేల ఉద్యోగాలను ఇప్పటివకే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిందని, మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనుందని తెలిపారు. అలాగే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో మరో 800 యూనిట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనుందని, దీని ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
జిల్లాలో అత్యధికంగా నిరుపేదలు ఉన్నారని, వారి కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నేతకాని కార్పొరేషన్, మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, లిడ్ క్యాప్ కార్పొరేషన్‌ను పునరుద్ధరించి, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.