కాంగ్రెస్ వైపు ప్రజలు.. కమీషన్ల వైపు కేసీఆర్ : జీ. వివేక్ వెంకటస్వామి

పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు.. కమీషన్ల వైపు కేసీఆర్ ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుకుని.. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారని చెప్పారు. ఇసుక మాఫియా ముసుగులో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారని, భూకబ్జాలు, కోల్ మాఫియాతో వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ గెలుపు పక్కా అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ప్రతియేటా మంచిర్యాల మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి బీఆర్ఎస్ నాయకులెవరూ సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి.. మాట్లాడలేదన్నారు. కేవలం ఓట్లు పడవనే భయంతో ఇవాళ మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ప్రజల సహకారం,  ఒత్తిడితోనే తాను చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నానని, తనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజాభిప్రాయం మేరకు చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. 

చిన్న రాష్ట్రం ఉంటే అభివృద్ధి చెందుతుందని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమన్నారు. మార్పు కోసం జనం తనను కోరుకుంటున్నారని చెప్పారు. తుగ్లక్ ముఖ్యమంత్రి కేసీఆర్ రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లు కట్టి రైతులను ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కు మంచి స్పందన : మోహన్ జోషి

చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు ఏఐసీసీ అబ్జర్వర్ మోహన్ జోషి. ఈ మూడు స్థానాల్లోనూ 100 శాతం కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అంతటా కాంగ్రెస్ గెలుపునకు ఈ మూడు స్థానాలు నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.

దుర్గం చిన్నయ్యపై గడ్డం వినోద్ ఆగ్రహం

బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమీ చేయలేదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్. తమపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని దుర్గం చిన్నయ్యను హెచ్చరించారు. 

ALSO READ: గౌరవెళ్లి నీళ్లు తీసుకురాకుంటే మళ్లీ ఓటు అడగను: పొన్నం ప్రభాకర్‌‌


బీఆర్ఎస్ ను ఓడిస్తాం :  ప్రేమ్ సాగర్ రావు

బీఆర్ఎస్ ను ఓడించేందుకు జీ. వివేక్ వెంకటస్వామి (చెన్నూరు), గడ్డం వినోద్(బెల్లంపల్లి), తాను ఒక్కటయ్యామని మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తామన్నారు. తమ లక్ష్యం, పోరాటం ఒకటేనని, కేసీఆర్ పై విజయం సాధిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాల టౌన్ మునిగిందని, ప్రజలంతా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. 

  • Beta
Beta feature