- పాలవాగు వంతెనపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం
- చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
- కాంగ్రెస్‌లో పలువురి చేరిక
కోల్ బెల్ట్, వెలుగు : చెన్నూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో పదేండ్లు పాలించిన బాల్క సుమన్ విఫలమయ్యాడని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మందమర్రి మండలం మామిడి గట్టు, ఆదిల్ పేట, పొన్నారం, వెంకటాపుర్, సారంగపల్లి, చిర్రకుంట, శంకర్ పల్లి, సండ్రోన్ పల్లి, మందమర్రి మార్కెట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. శంకర్ పల్లిలో పాలవాగుపై బ్రిడ్జి కట్టడం ముఖ్యమని చెప్పే బాల్క సుమన్.. ఈ విషయంపై గ్రామస్తులు వెళ్లి సమస్య చెప్పుకుందామంటే మాత్రం కలువడని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోని సుమన్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన మామిడి గట్టు మాజీ ఎంపీటీసీ కుమారస్వామి, మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ లీడర్ ఎర్ర రాజు కాంగ్రెస్ లో చేరగా.. వారికి వివేక్ వెంకటస్వామి, నల్లాల ఓదెలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
వధూవరులను ఆశీర్వదించిన వివేక్ వెంకటస్వామి
మందమర్రి సాయి మిత్ర గార్డెన్స్‌లో జరిగిన ఐఎన్టీయూసీ లీడర్ మండ భాస్కర్ గౌడ్-పద్మ దంపతుల కుమారుడు రవితేజ-గీత పెండ్లి వేడుకలకు వివేక్ వెంకటస్వామి, నల్లాల ఓదెలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అమ్మ గార్డెన్స్ లో మార్నింగ్ వాక్
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్స్‌లో వాకర్స్‌తో కలిసి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. తమ కాలనీల్లో కనీసం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదని, ఫలితంగా ఇబ్బందులు పడుతున్నామని వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్య పరిష్కరించేందుకు ఐదేండ్ల కాలంలో బాల్క సుమన్ ఒక్కసారి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని వివేక్ వెంకటస్వామి వారికి హామీ ఇచ్చారు.
ఇసుక దందాతో డబ్బు దోచుకుండు
ఆదివారం రాత్రి మందమర్రి మార్కెట్లో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో వివేక్ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడారు. బాల్క సుమన్ ఇసుక దందాతో వచ్చిన డబ్బును తన జేబులో వేసుకుంటున్నాడని, సాండ్ మాఫియాలో వేయి కోట్లు సంపాదించాడని ఆరోపించారు. స్థానిక ఆలయంలో పూజారి చెక్కతో తయారు చేసిన చేతి గుర్తును వివేక్ వెంకటస్వామికి అందించారు. ఐఎన్టీయూసీ ఆఫీస్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్‌తో కలిసి వివేక్పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని ఐఎన్టీయూసీ శ్రేణులను వివేక్ వెంకటస్వామి కోరారు.