అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి : వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మహిళలు వినియోగించుకోవాలి: వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • మహిళ విద్యావంతురాలైతే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడ్తది: సరోజా వివేక్‌‌‌‌
  • హైదరాబాద్‌‌‌‌ మింట్​ కాంపౌండ్‌‌‌‌లో మహిళా దినోత్సవం

బషీర్​బాగ్, వెలుగు: విద్యతోనే సామాజిక భద్రత వస్తుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అన్నారని, ప్రతి ఒక్కరు దానిని అనుసరించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌‌‌‌లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌‌‌‌లో ఆదర్శ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజా వివేక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సమాజంలో వివక్ష ఉన్న సమయంలో అంబేద్కర్ 23 డిగ్రీలు సాధించారని, ఆయన స్ఫూర్తితో అదే బాటలో నడవాలని సూచించారు. మనం క్రమశిక్షణతో ఉంటూ మన పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాలని, మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారని చెప్పారు. తన తండ్రి కాకా వెంకటస్వామి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అందులో భాగంగానే అంబేద్కర్ విద్యాసంస్థలను నెలకొల్పారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే తన భార్య సరోజ ఆ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరోజా వివేక్ మాట్లాడుతూ.. కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుందని చెప్పారు. 

తన మామ వెంకటస్వామి ఎంతో కష్టపడి అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌ను స్థాపించారని, ఆయన స్ఫూర్తితో ఆర్థిక భారం లేకుండా విద్యను అందిస్తున్నామన్నారు. డబ్బు కంటే ఆత్మవిశ్వాసం ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే, తన కుటుంబసభ్యుల మద్దతే కారణమని పేర్కొన్నారు. విశాక ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 30 ఏండ్లు అవుతోందని, ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ స్కూల్స్‌‌‌‌లో టాయిలెట్స్, తరగతి గదుల నిర్మాణంతో పాటు ఆడ పిల్లల విద్యకు తోడ్పాటు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను వివేక్ వెంకటస్వామి, సరోజా వివేక్ దంపతులు సన్మానించారు.