- సీఎం కేసీఆర్‌పై వివేక్ వెంకటస్వామి ఫైర్
- మహారాష్ట్ర మీటింగ్‌లు కాదు.. ఇక్కడి రైతుల కష్టాలు చూడు
- నెల కింద చెప్పిన పంట నష్ట పరిహారం ఇంకెప్పుడిస్తవ్?
- తడిసిన వడ్లను సెంటర్లలో కొనక రైతులు గోసపడ్తున్నరు
- పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వడ్ల కొనుగోలు సెంటర్ల పరిశీలన
పెద్దపల్లి/జగిత్యాల, వెలుగు: ఆత్మీయ సమ్మేళనాలు, మహారాష్ట్ర మీటింగ్‌లతోనే సీఎం కేసీఆర్‌కు సరిపోతున్నదని, ఇక్కడి రైతుల కష్టాలను ఆయన పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. తడిసిన వడ్లను కొంటామని సీఎం, మంత్రులు చెప్తున్న మాటలు ఉత్తవే అవుతున్నాయని తెలిపారు. తేమ, తప్ప, తాలు పేరుతో సెంటర్లలో నిర్వాహకులు, వ్యాపారులు కొనుగోళ్లు బంద్పెడ్తున్నారని, దీంతో రైతులు సెంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని శ్రీరాములపల్లి, కనుకుల, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శేకల్ల, మద్దునూర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం
ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వివేక్‌కు చెప్పుకున్నారు. వర్షాలతో మాయిశ్చర్ రావడం లేదంటూ సెంటర్ నిర్వాహకులు వడ్లు కొంటలేరని తెలిపారు. దీంతో వివేక్ వెంటనే జిల్లా అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వడ్ల కొనుగోళ్లు త్వరగా జరిగేలా చూడాలన్నారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తడిసిన వడ్లను కొంటామని సీఎం, మంత్రులు చెప్తున్నరు.. కానీ కొనుగోలు సెంటర్లలో పరిస్థితి మరోలా ఉంది.. తేమ, తప్ప, తాలు అనుకుంటూ కొర్రీలు పెడ్తున్నరు..’’ అని తెలిపారు. దెబ్బతిన్న పంటలకు గత నెల ఇస్తానన్న రూ. పది వేల నష్టపరిహారం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. పంట నష్టపోయిన రైతుల గోడును వినే తీరిక లేదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
వడ్లు కొనని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి
జగిత్యాల జిల్లాలో క్వింటాల్ కు 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని వివేక్‌కు రైతులు చెప్పుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని వివేక్ అన్నారు. తేమ ఉన్నా, రంగుమారినా, మొలకలు వచ్చినా ఆఖరు గింజ వరకు సర్కారే కొనాలన్నారు. గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించి ఉంటే రైతులు ఇంతగా పంట నష్టం చవిచూసేవారు కాదని ఆయన తెలిపారు.
ఫసల్ బీమాను రాష్ట్ర సర్కారు పక్కనపెట్టింది
‘‘సీఎం కేసీఆర్ ఫెడరల్ సెటప్ గురించి తెలుసుకోవాలి. పంట నష్టపోయినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రానికి పంపితే రైతులకు నష్టపరిహారం అందుతుంది. రైతుల కోసం కేంద్రం ఫసల్ బీమా స్కీం అమలు చేస్తున్నది. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది” అని వివేక్ వెంకటస్వామిమండిపడ్డారు.
ఇథనాల్ ప్రాజెక్టుపై భయం పోగొట్టాలి..
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో చేపట్టనున్న ఇథనాల్ ప్రాజెక్టు విషయంలో స్థానిక గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమ వ్యవసాయ భూములు దెబ్బతింటాయని, కాలుష్యం పెరిగిపోతుందని జనం ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ‘‘ఇథనాల్ ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న భయాందోళనను ప్రభుత్వమే పోగొట్టాలి. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే తానే బాధ్యత వహిస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అప్పుడే ప్రజలు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే అవకాశం ఉంది” అని ఆయన అన్నారు. వివేక్ వెంకటస్వామి వెంట బీజేపీ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, మీసా అర్జున్‌రావు, సయ్యద్ సజ్జద్, కస్తూరి సత్యం, సూర్యనారాయణ, మల్లేశం, తదితరులు ఉన్నారు.
మహారాష్ట్ర , పంజాబ్‌ను మర్చిపో
మహారాష్ట్ర, పంజాబ్‌ను మర్చిపోయి తెలంగాణలో రైతులు పడుతున్న బాధలను చూడాలని సీఎం కేసీఆర్‌కు వివేక్‌వెంకటస్వామి సూచించారు. ‘‘ఇటీవల మహారాష్ట్రలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో కేసీఆర్ ఓటుకు రూ. 10 వేలు ఇచ్చాడు. తానేమో పీఎం, కొడుకేమే సీఎం, బిడ్డను మరోసారి పార్లమెంట్‌కు పంపాలని కేసీఆర్ కలలు కంటున్నడు. ఒకవైపు ఈడీ రిపోర్టులో వందల ఎకరాలు కవిత కొన్నట్లుగా తెలుస్తున్నది. సీఎంకు తన కుటుంబం మీదే ఆలోచన తప్ప రైతులను ఆదుకునే ఆలోచన లేదు” అని మండిపడ్డారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులు, సెక్రటేరియట్ నిర్మాణాల్లో వేల కోట్ల కమీషన్లు దండుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రైతు రుణమాఫీ పట్టడం లేదు. రైతులు, ప్రజలు దీన్ని గమనిస్తున్నరు.సరైన సమయంలో బుద్ధి చెప్తరు” అని వివేక్ హెచ్చరించారు. రుణమాఫీ అమలు చేయకపోవడంతో బ్యాంకర్లు రైతుల అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు నీట మునగడంతో కాంట్రాక్టర్‌కు రూ.1,200 కోట్లు చెల్లించిన ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం శోచనీయం. లక్షలాది రూపాయలతో గ్రామాల్లో నిర్మించిన రైతు ఐక్య వేదికలు ఎందుకూ పనికిరాకుండా పోయినయ్. రాష్ట్ర ప్ర భుత్వం చేపడ్తున్న అన్ని నిర్మాణాల పరిస్థితి ఇట్లనే ఉంది” అని అన్నారు.