- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి
- లక్సెట్టిపేట బైపాస్ మీదుగా ఎన్ హెచ్ 63ని విస్తరించాలని గడ్కరీకి వినతి
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హైవే 63ని లక్సెట్టిపేట బైపాస్ మీదుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అలాగే త్వరలో సికింద్రాబాద్–నాగపూర్ మధ్య ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను మంచిర్యాలలో ఆపాలని కోరారు. గురువారం పార్లమెంట్ లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వివేక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆర్మూర్–మంచిర్యాల మధ్య చేపడుతున్న ఎన్ హెచ్ 63 వల్ల లక్సెట్టిపేట ప్రజలకు కలిగే నష్టాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
‘‘ప్రతి మున్సిపాలిటీలో బైపాస్ మీదుగా వెళ్తున్న ఈ నేషనల్ హైవే.. లక్సెట్టిపేటలో మాత్రం టౌన్ మధ్యలో నుంచి వెళ్తున్నది. దీంతో ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి” అని చెప్పారు. లక్సెట్టిపేట బైపాస్ రోడ్డు ప్రతిపాదనను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఐఏ) తిరస్కరించిందని, ఈ విషయమై ఎన్ హెచ్ఐఏతో మాట్లాడి లక్సెట్టిపేటలో బైపాస్ రోడ్డు మీదుగా హైవేను విస్తరించాలని కోరారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. కాగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోనూ వివేక్ భేటీ అయ్యారు. త్వరలో సికింద్రాబాద్– నాగపూర్ మధ్య ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మంచిర్యాలలో ఆపాలని కోరారు. అలా చేస్తే మంచిర్యాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.