
- ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా: వివేక్ వెంకటస్వామి
- గిరిజన భవనానికి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తానని వెల్లడి
- గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర, సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వివేక్
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: గాంధారీ మైసమ్మ తల్లి దయతోనే చెన్నూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్దనున్న గాంధారిఖిల్లాలో జరుగుతున్న గాంధారీ మైసమ్మ జాతర, చెన్నూరు పట్టణం మైనార్టీ ఫంక్షన్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధారీ మైసమ్మ, దేవత మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్‌ను నాయక్ పోడ్ ఆదివాసీ గిరిజనులు, లంబాడీలు ఘనంగా సత్కరించారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. గాంధారీ ఖిల్లా జాతరలో పాల్గొని పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు రావడం గొప్ప విషయమన్నారు. ఏటా తాను ఈ జాతరకు వస్తున్నానని, గతేడాది కంటే ఈసారి ఏర్పాట్లు ఎక్కువగా చేశామని తెలిపారు.
రాష్ట్ర సర్కార్ జాతర కోసం రూ.44 లక్షలు కేటాయించిందని వెల్లడించారు. ఆదివాసీ నాయకులను గోండు జాతిలో కలపడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు తన దృష్టికి తెచ్చారని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం సీఎంతో మాట్లాడతానన్నారు. అటవీ ప్రాంతం కావడంతో గాంధారీ ఖిల్లా అభివృద్ధికి పర్మిషన్లు రావడం ఆలస్యమవుతుందని చెప్పారు. నాయక్ పోడ్ కులస్తుల భవనం కోసం ల్యాండ్, రూ.20 లక్షల ఫండ్స్ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో గాంధారీ ఖిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాయక్ పోడ్ ఆదివాసీ సంఘం లీడర్లు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కారించేందుకు కృషి చేస్తానని వివేక్ హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలుపు ఖాయం
కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్యేలందరం కృషి చేస్తున్నామని వివేక్ అన్నారు. ఈ నెల 21న చెన్నూరులో నియోజకవర్గ పట్టభద్రులతో నరేందర్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమన్నారు.
మందమర్రిలోని మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్‌లో స్థానిక కాంగ్రెస్ లీడర్ తిరుమల్ రెడ్డికి సంబంధించిన ఎంఎన్ఆర్ క్యాంటీన్‌ను వివేక్వెంకటస్వామి ప్రారంభించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్‌వీఎస్‌లో అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్, కాంగ్రెస్ లీడర్ బండి సదానందం యాదవ్ అక్క కూతురు, జైపూర్ మండలం ఇందారం గ్రామంలో తల్లపలి వెంకటేశ్ కూతురు, రామకృష్ణాపూర్‌కు చెందిన కాంగ్రెస్ లీడర్ మహంకాళి శ్రీనివాస్ సోదరుడి కూతురు వివాహాలకు వివేక్వెంకటస్వామి హాజరై, నూతన వధూవరులనుఆశీర్వదించారు.
గిరిజన భవనానికి 7 గుంటల భూమి..
గిరిజన భవనానికి కావాల్సిన 7 గుంటల భూమి ఇచ్చేందుకు కృషి చేయడంతో పాటు తన ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఏటా రవీంద్ర భారతిలో సంత్ సద్గురు సేవాలాల్ మహారాజు జయంతి కార్యక్రమంలో తాను పాల్గొనేవాడినని, అయితే, ఇక్కడ స్థానికుల అడగగానే చెన్నూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంత్‌లాల్ జయంతి సందర్భంగా చెన్నూరులో భారీ ర్యాలీ తీయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
సేవాలాల్ మహారాజ్ అంటే తనకు చాలా గౌరవమని, లంబాడీ జాతికి ఆయన ఎనలేని సేవలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి లంబాడీలకు న్యాయం జరిగేలా చూస్తానని, ఇప్పటికే సీఎంతో మాట్లాడి సోషల్ వెల్ఫేర్‌కి నిధులు పెంచాలని కోరానని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎస్సీ, ఎస్టీ ఫండ్స్‌ని కేవలం వారికే కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించానని తెలిపారు.