చెన్నూరులో వివేక్ వెంకటస్వామి బైక్ ర్యాలీ..భారీగా తరలివచ్చిన జనం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు ఆ పార్టీ నేత వివేక్ వెంకటస్వామి. ఇందారం నుంచి జైపూర్ మెయిన్ క్రాస్  రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొడుకు వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. చెన్నూరు వరకు ఈ బైక్ ర్యాలీ  కొనసాగనుంది. ఇప్పటికే 10 కిలో మీటర్ల వరకు బైక్ ర్యాలీ సాగింది. ఇంకా 20 కిలో మీటర్ల వరకు  కొనసాగనుంది. స్థానిక గ్రామస్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  కార్యకర్తల బైక్ లతో  ఇందారం రోడ్డు నిండిపోయింది.

ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్  ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. విదేశీ విద్య కింద రూ.5 లక్షల సాయం చేస్తామని చెప్పారు. మహిళలకు రూ.500లకే సిలిండర్ ఇస్తామని..  అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్పారు.  బాల్కసుమన్ చెన్నూరులో నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీగా ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కు ఓటేసి కేసీఆర్ ను గద్దె దించాలన్నారు.