మునుగోడులో రాజగోపాల్రెడ్డి 50వేల మెజార్టీతో గెలుస్తడు : వివేక్

శ్రీలంకను అప్పటి అధ్యక్షుడు రాజపక్స దోచుకున్నట్లు తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ తప్పదని విమర్శించారు. మునుగోడులో బీజేపీ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. తన తండ్రి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. కోవిడ్ టైంలో కేంద్రం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేసినట్లు వివరించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి 50వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

అంతకుముందు నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో వివేక్ వెంకటస్వామి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటెయ్యాలని కోరారు. కేంద్రం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.