కేసీఆర్​ దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు .. వివేక్ వెంకటస్వామి సవాల్

  • ఐటీ, ఈడీ దాడుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర
  • లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్​పై ఎందుకు విచారణ చేయట్లే
  • ఆధారాలిచ్చినా అమిత్​ షా ఎందుకు సైలెంట్​గా ఉన్నారు 
  • కవిత లిక్కర్ స్కామ్ కేసు ఏమైందని ప్రశ్న

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే తనపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కేసీఆర్ కు దమ్ముంటే తనతో రాజకీయంగా కొట్లాడాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలన్న కుట్రతోనే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులపై ఐటీ రెయిడ్స్ తో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఎలక్షన్ టైమ్ లో ఐటీ, ఈడీ దాడులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. మంగళవారం మంచిర్యాలలోని తన ఇంట్లో ఐటీ సోదాల అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. 

‘‘నేను ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాను. విశాక ఇండస్ట్రీస్ ఆడిటింగ్ బాగుందని ఐటీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది” అని ఆయన తెలిపారు. ‘‘హుజూరాబాద్ బై ఎలక్షన్ టైమ్ లో కూడా నా ఇంటిని పోలీసులతో బాల్క సుమన్ సోదాలు చేయించాడు. ఇప్పుడు నాకు సంబంధం లేని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ లో కుట్రపూరితంగా నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. బాల్క సుమన్ ఫిర్యాదు చేశాడని మంచిర్యాల, హైదరాబాద్ లోని నా ఇండ్లు, ఆఫీసులపై పది చోట్ల ఐటీ అధికారులు రెయిడ్స్ చేశారు. ఎన్ని రెయిడ్స్ చేసిన నాకేమీ కాదు. చెన్నూర్ లో ఓటమి తప్పదని తెలిసే బాల్క సుమన్ ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు” అని వివేక్​ మండిపడ్డారు. 

అమిత్ షా స్టేట్​మెంట్లు తప్ప.. విచారణేదీ? 

సీఓటర్ సర్వే ప్రకారం కేసీఆర్ దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని తేలిందని వివేక్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథతో కేసీఆర్ లక్ష కోట్లకు పైగా దోచుకున్నారని, ధరణితో వందల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ‘‘నేను నాలుగేండ్లు బీజేపీలో ఉన్నప్పుడు కేసీఆర్ అవినీతిపై విచారణ చెయ్యుమని అమిత్ షాను అడిగాను. ఆధారాలు కూడా ఇచ్చాను. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని అమిత్ షా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు తప్ప.. ఎందుకు విచారణ చేయించడం లేదు? కవిత లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఎందుకు కదలిక లేదు” అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇండ్లపైనా ఐటీ రెయిడ్స్ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్, బాల్క సుమన్ పని అయిపోయింది. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. రాహుల్ గాంధీ చెప్పినట్టు కేసీఆర్, బాల్క సుమన్ తిన్నదంతా కక్కిస్తాం. నాతో పాటు నా కుటుంబ సభ్యులను 12 గంటలు నిర్బంధించి ప్రచారాన్ని అడ్డుకోవడం తప్ప.. వారు సాధించిందేమీ లేదు” అని అన్నారు. చెన్నూర్ ప్రజలు తనకు అండగా ఉండి, తనపై చూపించిన ప్రేమకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని చెప్పారు. 

చెన్నూర్​లో భారీ నిరసన ర్యాలీ.. 

మంచిర్యాలలోని వివేక్ ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారన్న సమాచారంతో చెన్నూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెన్నూర్​లో వివేక్​విజయం ఖాయమని సర్వేల్లో తేలడంతో దిక్కుతోచని స్థితిలో అధికార పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీతో కలిసి దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వివేక్​ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు.

మరోవైపు వివిధ మండలాల నుంచి చెన్నూరు పట్టణానికి భారీగా చేరుకున్న కాంగ్రెస్​నేతలు, కార్యకర్తలు.. గాంధీ చౌక్ నుంచి జలాల్ పెట్రోల్ బంక్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్మెల్యే బాల్కసుమన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, సుద్దపల్లి సుశీల్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అక్కసుతోనే బీఆర్ఎస్, బీజేపీ కుట్రపూరితంగా వివేక్ ఇండ్లపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు.

చెన్నూర్ లోని బాల్క సుమన్ అనుచరులైన మాజీ జడ్పీటీసీ కరుణసాగర్ రావు, గవర్నమెంట్ టీచర్ మడక రవి, మున్సిపల్ చైర్మన్ భర్త రామ్ లాల్ గిల్డా ఇండ్లపైనా దాడులు చేస్తే.. ఎలక్షన్ కోసం సుమన్ దాచిన కోట్లాది రూపాయలు దొరుకుతాయని చెప్పారు. నాయకులు గొడిశాల బాపిరెడ్డి, చల్లా రాంరెడ్డి, సుశీల్, మైదం రవి, సుధాకర్ రెడ్డి, సూర్యనారాయణ, అంకాగౌడ్, బుర్ర కృష్ణ, తనుగుల రవి, అన్వర్, భద్రయ్య చారి, శ్రీధర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

నేషనల్ హైవేపై బైఠాయింపు.. 

జైపూర్(భీమారం), వెలుగు: వివేక్ ఇంటిపై ఐటీ, ఈడీ దాడులను భీమారం మండలానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు ఖండించారు. పార్టీ ఆఫీసులో పొడేటి రవి, వేల్పుల శ్రీనివాస్, ప్రకాశ్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి దాడులకు వివేక్ వెంకటస్వామి, ఆయన కుటుంబసభ్యులు భయపడబోరన్నారు. ఓటమి భయంతోనే బాల్క సుమన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఐదేండ్లలో చెన్నూర్ నియోజకవర్గంలోని యువతను మద్యా నికి బానిసగా మార్చడం తప్ప.. బాల్క సుమన్ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యా రు.

ALSO READ : తెలంగాణలో ఎన్నికల పోరాటం : అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం!

సీఆర్​చిన్న కొడుకు బాల్క సుమన్ ను జైలుకు పంపే రోజులు దగ్గర పడ్డాయ న్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఆవుడం ఎక్స్ రోడ్డు వద్ద నేషనల్ హైవేపై బైఠాయించి అరగంట సేపు నిరసన తెలిపారు. కేసీఆర్ కు, బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ లీడర్లు మోహన్ రెడ్డి, లక్ష్మణ్, విశ్వతేజ రెడ్డి, తిరుపతి, సత్తిరెడ్డి, వనపర్తి రమేశ్, డేగ రమేశ్, షేడంశెట్టి రమేశ్, అలకాటి తిరుపతి, తైనేని రవి  పాల్గొన్నారు.