మందు, బిర్యానీతో యూత్ ను బాల్క సుమన్ మభ్యపెడ్తుండు : వివేక్​ వెంకటస్వామి

యువతకు ఉద్యోగాలు ఇప్పించాలనే కనీస సోయి లేని ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఓట్లు దండుకోవడానికి యువతకు మద్యం పోస్తూ, బిర్యానీలు తినిపిస్తున్నాడని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ ​అభ్యర్థి గడ్డం వివేక్​వెంకటస్వామి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంతోపాటు చెన్నూరులోని పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. శంకరపురం, భావనపల్లి, పంగిడి సోమారం, మల్లంపేట, నక్కలపల్లి, కొందంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. 

ఈ సందర్భంగా వివేక్​వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్, గెలిచాక తన ఇంట్లోని ఆరుగురికి పదవులు ఇచ్చుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకుంటే, ఇసుక వ్యాపారంతో బాల్క సుమన్ వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.  కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో పంటలు మునిగి నష్టపో యిన రైతులకు పరిహారం ఇప్పించాలన్న సో యి బాల్క సుమన్​కు లేదన్నారు.

 కోటపల్లి మండల కేంద్రంలో కొత్త ఇళ్లు కట్టిస్తానని చెప్పి, 120 ఇండ్లను కూల్చిన సుమన్​తిరిగి ఎందుకు కట్టించలేదో చెప్పాలని వివేక్ ​ప్రశ్నించారు. కేసీఆర్​ దత్త పుత్రుడైన బాల్క సుమన్​ బాధితుల తరఫున కొట్లాడకుండా, ఎందుకు సైలెంట్​గా ఉన్నాడని నిలదీశారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే కోటపల్లిలోని బాధితులకు ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

అక్రమ సంపాదనే ధ్యేయం

అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఫాంహౌస్​లో, కేటీఆర్ విదేశాల్లో, లిక్కర్ దందా కోసం కవిత ఢిల్లీలో ఉంటే.. రాష్ట్ర ప్రజలను పట్టించుకునేది ఎవరని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ​విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సహజ వనరులపై కన్నేసి దోచు కుంటున్నారన్నారు. తాను ఏ పదవిలో లేకున్నా10 ఏండ్లుగా కాకా ఫౌండేషన్​తో సేవ చేస్తు న్నానని గుర్తు చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో అధికంగా కోటపల్లి మండలంలోని రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకపోగా, కనీసం రైతులను పరామర్శించేందుకు కూడా బాల్క సుమన్ రాలేదన్నారు. సుమన్​కు ‘ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టడం.. ఇసుక దందా చేసి అక్రమంగా సంపాదించడం’ మాత్రమే తెలుసని వివేక్ ​ఆరోపించారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పారు.

సుమన్​కు వేల కోట్లు ఎక్కడివి?: బల్మూరి వెంకట్

‘చెమట సుక్క సెంటు సుక్క’ అన్న బాల్క సుమన్​కు ఇప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఎన్ఎస్​యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ విద్యార్థి నిరుద్యోగుల సదస్సులో ప్రశ్నించారు. నిరుద్యోగుల సంకల్పం చూస్తే.. ఇక బాల్క సుమన్ బట్టలు సర్దుకోవాల్సిన టైం వచ్చిందన్నారు.  తెలంగాణలో అతి  పెద్ద కులం నిరుద్యోగుల కులం అని, ఆ కులం తమవైపు ఉందన్నారు. ‘నేను ఒక్కడిని ప్రగతి భవన్ గేట్ ఎక్కితే దాని చుట్టూ కంచె వేసుకున్న వ్యక్తి కేసీఆర్.. నాకు కేసీఆరే భయపడ్డడు.. నువ్వెంత సుమన్? ఇంకెన్ని రోజులు కల్వకుంట్ల బానిసగా ఉంటవ్​’ అని  వెంకట్ ​ఫైర్ అయ్యారు. మాట్లాడితే బాల్క సుమన్ వంద కేసులు అంటాడని,  తెలంగాణ వచ్చిన తర్వాత తనపై కేసులు పెట్టించిందే బాల్క సుమన్  అని గుర్తు చేశారు. 

బాల్క సుమన్​ చదివిన ఓయూలో తాను కూడా చదివానని చెప్పుకునేందుకు ఇజ్జత్​ పోతోందని ఓయూ జేఏసీ విద్యార్థి లీడర్ మహిపాల్ యాదవ్ అన్నారు. నిరుద్యోగులతో పెట్టుకున్న కేసీఆర్ పదవీచిత్యుడు కాక తప్పదని జోస్యం చెప్పారు. చెరువులో డబుల్ బెడ్రూం ఇండ్లు కడ్తున్న బాల్క సుమన్, అందులో ఆయన కుటుంబాన్ని, కేసీఆర్​ కుటుంబాన్ని ఉంచాలన్నారు. బాల్క సుమన్ అసలు సిసలు ఉస్మానియా విద్యార్థి కాదని, ఏ కమిట్​మెంట్​ లేని  కేసీఆర్ బానిస అని హైకోర్టు అడ్వొకేట్​శరత్ విమర్శించారు. విద్యార్థి నిరుద్యోగుల సదస్సులో సీనియర్ హైకోర్టు న్యాయవాది శరత్, మూల రాజిరెడ్డి, ఐత హేమమంత్ రెడ్డి, మైధం కళావతి, రవి, డాక్టర్ హాబీబ్, నూకల రమేశ్, చల్లా రాంరెడ్డి, దుర్గం నరేశ్, శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

యువత కోసం స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్లు

తనను గెలిపిస్తే యువత కోసం చెన్నూర్​లో మూడు స్కిల్ ​డెవలప్​మెంట్ ​సెంటర్లతో పాటు మైనింగ్ ఇన్​స్టిట్యూట్ ఏర్పాటు చేస్తానని వివేక్​ వెంకటస్వామి హామీ చెప్పారు. శుక్రవారం రాత్రి మంచి ర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్​లో జరిగిన విద్యార్థి నిరుద్యో గుల సదస్సుకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ హాజరయ్యారు. అహంకారి బాల్క సుమన్ కార్యకర్తల బట్టలు ఊడదీసి కొడ్తనని బెదిరిస్తున్నడు.. కానీ 30న సుమన్ బట్టలు ఊడదీసి ఇక్కడి నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు’ అని వివేక్​చెప్పారు.