కాంట్రాక్టర్లకు కొమ్ముకాసిన కేసీఆర్​ : వివేక్​ వెంకటస్వామి

  • ధనవంతుల కోసం పనిచేసిన ప్రధాని మోదీ
  • వంశీని గెలిపిస్తే ఉపాధి అవకాశాలు
  • వడ్ల కోనుగోలు కేంద్రాల్లో అవినీతి చేసినోళ్లను జైలుకు పంపుతా 
  • ప్రచారంలో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ధనవంతుల కోసం పనిచేస్తే.. కేసీఆర్​ కాంట్రాక్టర్ల కొమ్ముకాశాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో పెద్దపల్లి కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ధర్మారం, రెడ్డిపల్లి, దాపూర్, కొత్తగూడెం, కాజిపల్లి, నర్సింగాపూర్, బూరుగుపల్లి, పోతన్​పల్లి, కొత్తపల్లి, ఎల్​బీపేట్, ఏల్కేశ్వరం, మద్దికల్, ఆరేపల్లి, పోలంపల్లి, భీమారం మండల కేంద్రాల్లో ప్రచారం చేసి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు.

వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని చెప్పారు. అదానీ, అంబానీ, కార్పోరేటర్లకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన నరేంద్ర మోదీ సామాన్యులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో రూ.460 ఉన్న గ్యాస్ ​సిలిండర్​ధర రూ.1050కు పెరిగిందని, లీటర్ ​పెట్రోల్​ రూ.60 నుంచి రూ.110కి పెంచిందన్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్​వస్తే ప్రజాపాలన సాగుతుందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాడని చెప్పారు.

ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్​ సర్కార్

సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ​సర్కార్ ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేసిందని, ఎన్నికల కోడ్ అనంతరం మిగిలినవి అమలు చేస్తుందని ఎమ్మెల్యే వివేక్​ చెప్పారు. ఆస్పత్రి ఖర్చులతో ప్రజలు గోసపడుతున్నారనే ఉద్దేశంలో రాజీవ్​ ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న రూ.10 లక్షలను రాహుల్​ గాంధీ రూ.25 లక్షలకు పెంచుతానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులైన పేదలకు అందిస్తామన్నారు. పదవిలో ఉన్నా, లేకున్నా కాకా కుటుంబం పెద్దపల్లి ప్రాంత ప్రజలకు సేవ చేస్తోందన్నారు.

విశాక ట్రస్ట్, కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో 2 వేల బోర్లు, 2వేల స్కూళ్లలో ఫర్నీచర్ ఏర్పాటు చేశామన్నారు. తన కొడుకు వంశీకృష్ణ ప్రజలకు సేవల చేసేందుకే రాజకీయాల్లో వచ్చాడని చెప్పారు. వడ్ల కోనుగోలు కేంద్రాలను ఎన్నికల కోడ్​తర్వాత మార్చుతామని, అవకతకవలకు పాల్పడిన వారిని జైళ్లో పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్​లో చేరగా వారికి వివేక్​కండువాలు కప్పి ఆహ్వానించారు. సాయంత్రం కురిసిన వర్షంలో సైతం ప్రచారం చేశారు. లీడర్లు మోహన్ రెడ్డి, పొడేటి రవి, భూక్య లక్ష్మణ్, చేకూర్తి సత్యనారాయణ రెడ్డి, పున్నంచంద్, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, వేల్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు

కేసీఆర్ పదేండ్ల పాలనలో అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిండని వివేక్​ అన్నారు. అసెంబ్లీలో రూ.3లక్షల అప్పులు తీసుకున్నట్లు చెప్పిన కేసీఆర్​ గద్దెదిగే నాటికి రూ.7లక్షల అప్పులు చేశాడన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు, మిషన్​ భగీరథలో రూ.60 వేల కోట్లు మింగిండని అన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లను ధనవంతులను చేసి వేల కోట్ల కమీషన్లు దండుకున్నాడని ఆరోపించారు. అందరికీ డబుల్​ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల స్థలం ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశాడని ఫైర్​ అయ్యారు.