ప్రతి పనిలో కమీషన్లు తీసుకుంటుండు : వివేక్ వెంకటస్వామి
రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నడు
ఢిల్లీలో కవితకు 800 లిక్కర్ షాపులు
అరెస్టయిన అభిషేక్ రావు ఆమెకు బినామీ అని ఆరోపణ
యాదాద్రి/మునుగోడు, వెలుగు : కేసీఆర్ మరో పేరు కల్వకుంట్ల కమీషన్ రావు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్ ప్రతి పనిలో కమీషన్లు తీసుకుంటుండు. కాళేశ్వరం పేరుతో తన కుటుంబానికి రూ.70 వేల కోట్లు దోచిపెట్టిండు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.5 లక్షల కోట్లు దోచుకుండు” అని ఆయన ఆరోపించారు. బుధవారం చౌటుప్పల్‌లో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో వివేక్ పాల్గొన్నారు. అనంతరం మునుగోడులో రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.
ఇండ్ల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పోశాడని వివేక్ మండిపడ్డారు. కేసీఆర్అవినీతితోనే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల అప్పు అయ్యిందన్నారు. ‘‘ఉద్యమకారులంటే కేసీఆర్‌కు విలువ లేదు. డబ్బులు ఇచ్చేవారంటేనే ఆయనకు ఇష్టం. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లను అమ్ముకున్నాడు” అని ఆరోపించారు.
ధరణితో 18 లక్షల కోట్ల స్కామ్..
ధరణి పోర్టల్‌తో రూ.18 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వివేక్ డిమాండ్ చేశారు. ‘‘ఢిల్లీలో కవితకు 800 లిక్కర్ షాపులు ఉన్నాయి. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన అభిషేక్ రావు ఆమెకు బినామీ. కవిత స్కామ్‌లో ఇరుక్కోవడంతో కేటీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు” అని అన్నారు. పేదలకు ఇండ్లు కట్టించని కేసీఆర్.. తనతో పాటు కొడుకు, బిడ్డ, అల్లుడికి ఫామ్ హౌస్‌లు కట్టించారని మండిపడ్డారు. ‘‘మునుగోడులో మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందడం లేదు. చర్లగూడెం, డిండి ప్రాజెక్టుల భూనిర్వాసితులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులో సీఎం నిర్లక్ష్యం చూపుతున్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు” అని ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి తన సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేశారని, ఉప ఎన్నికలో ఆయన గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.