
కోల్బెల్ట్: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగితే మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణతో కలిసి ఆయన ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో పలు వార్డుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మందమర్రి మున్సిపాలిటీ పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేశామన్నారు. దేశంలో గోల్ మాల్ చేసే అతిపెద్ద సంస్థలకు, రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి, ఇతర కాంట్రాక్టర్ల ద్వారా కేసీఆర్ అవినీతి చేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిండని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లకే ఎక్కువ సొమ్మును కట్టబెట్టాడని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి మేఘ ఇంజినీరింగ్ కంపెనీ ఫండ్స్ ఇచ్చిందన్నారు. ప్రజల సొమ్మును మనీ ల్యాండరింగ్ రూపంలో కేసీఆర్కు కట్టబెట్టిన వారిపై కేసులు బుక్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. మనీ లాండరింగు కు పాల్పడిన కాంట్రాక్టర్లు, సంస్థలపై ఈడీ విచారణ జరపాలని కోరారు. మనీ ల్యాండరింగ్ పేరుతో వేలకోట్లను దోచుకుని సొంత ఆస్తులను పెంచుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ సంస్థను రాజకీయ నాయకుల మీద మాత్రమే కాక అవినీతిపరులపై ఉపయోగించాలని సూచించారు.
కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ గా మారిండు
10 సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్తి కొప్పుల ఈశ్వర్ కోట్ల రూపాయల ఈశ్వర్ గా మారిండని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆరోపించారు. బీఆర్ఎస్ లీడర్లు ఏం మొహం పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలపై దౌర్జన్యాలు చేసిన కొప్పుల ఈశ్వర్ ఎట్లా ప్రచారంలో తిరుగుతాడని నిలదీశారు.ఓటమి ప్రస్టేషన్ కు గురి అయ్యిన సిగ్గులేని బాల్క సుమన్ కు కనీసం ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దత్తత పుత్రునిగా బాల్క సుమన్ దౌర్జన్యాలకు పాల్పడినట్లు స్వయంగా కనిపిస్తోందన్నారు. చెన్నూరు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ రాక్షస పాలనలా కొనసాగిందని మండిపడ్డారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలన, కాక హయాంలోనే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజలు ఇప్పటికీ అప్పుడు జరిగిన అభివృద్ధినే ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను పెద్దపెల్లి ఎంపీగా ప్రజలు ఆదరిస్తే పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎలక్టోరల్బాండ్స్ అంటేనే అధికారికంగా లంచం ఇవ్వడమేనని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కట్టబెట్టారని ఆరోపించారు. అంతకుముందు రామకృష్ణాపుర్ లోని మున్నా చర్చిలో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.