సమ్మెలో ఉన్న 40 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. వారిని నాలుగో తరగతి ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడితే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చి.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, డిమాండ్లను బొగ్గు గని, కేంద్ర కార్మిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి పర్మినెంట్ కార్మికులకు వేతనాలు ఇచ్చారు గానీ, కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రానికి మొదటిసారి వచ్చిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామికి మాజీ ఎంపీపీ అనంత రాజు గౌడ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత శాలువాతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంత రాజు గౌడ్ సమక్షంలో సరంపేట, తమ్మడపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మాజీ జెడ్పీటీసీ యాదయ్య, రామదాసు, శ్రీనివాస్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.