
- నేను ఏ పార్టీలో ఉన్నా.. ప్రజలకు సేవ చేసేందుకే పని చేశా: వివేక్ వెంకటస్వామి
- నాకు మంత్రి పదవిపైకొందరు మాట్లాడుతున్నరు..వాటిని పట్టించుకోను
- అధిష్టానం నిర్ణయానికికట్టుబడి ఉంటా
- ప్రజల్లో కాకా కుటుంబానికి ఉన్న ఆదరణ హైకమాండ్‌కు తెలుసు
- బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు
- సీఎం ఆహ్వానం మేరకే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడి
- మంచిర్యాల జిల్లాలో అంబేద్కర్జయంతి వేడుకల్లో పాల్గొన్న వివేక్, గడ్డం వంశీకృష్ణ
కోల్‌బెల్ట్/ పెద్దపల్లి/ఆదిలాబాద్/గోదావరిఖని, వెలుగు: ప్రజా సేవే కాకా ఫ్యామిలీ బ్రాండ్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా.. ప్రజలకు సేవ చేసేందుకే పనిచేశానని పేర్కొన్నారు. ప్రజల్లో కాకా కుటుంబానికి ఉన్న ఆదరణ, బ్రాండ్ ఏంటో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసని, అందుకే గత ఎన్నికల్లో పిలిచి తమకు టికెట్లు ఇచ్చిందన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాకా కుటుంబం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచి సత్తాచాటరని గుర్తుచేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాతనపల్లి, మందమర్రి, భీమారం, చెన్నూరు, జైపూర్‌లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అలాగే, జైపూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో వివేక్ మాట్లాడారు. కాకా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని ఏండ్లుగా సేవలు చేస్తుందో ప్రజలకు, కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలుసన్నారు. తనకు మంత్రి పదవిపై కొంతమంది మాట్లాడుతున్నారని, వాటిని పట్టించుకోనన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని కొందరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మంత్రి పదవి కోసం తానెక్కడికి వెళ్లలేదని వివేక్ స్పష్టం చేశారు. తాను న్యాయం కోసం పని చేస్తానని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం అప్పటి సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యపై కొట్లాడానని గుర్తుచేశారు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకే నాడు బీజేపీలో చేరినట్టు చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడంలో తాను కీలకపాత్ర పోషించానన్నారు.
గెలుస్తామనే మాకు టికెట్లు ఇచ్చారు..
గతంలో మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాలేదని, ఆ సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఘర్ వాపసీ నినాదం ఇచ్చారని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. తానెప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ లేకుండా పోయిందని, దీంతో అక్కడ కాకా కుటుంబాన్ని పోటీ చేయిస్తే పార్టీ గెలుస్తుందని అధిష్టానం గుర్తించి, తమను ఆహ్వానించిన విషయం మరిచిపోవద్దన్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటు వంశీకృష్ణకు ఇవ్వొద్దని చాలా మంది అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారని, అయితే, కాకా కుటుంబానికి చెందిన వంశీకృష్ణ తప్ప అక్కడ వేరే వాళ్లు గెలవరని సర్వేలో తేలడంతో కాంగ్రెస్ పార్టీ సీటు ఇచ్చిందని తెలిపారు. అనుకున్నట్లే పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలిస్తే చుట్టూ 4 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. వంశీకి 3.5 లక్షల ఓట్లు వచ్చాయని, ప్రజల్లో కాకా కుటుంబానికి ఉన్న బ్రాండ్‌కు ఇది నిదర్శనమన్నారు.
కేసీఆర్ నమ్మించిగొంతు కోసిండు..
2019 ఎంపీ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ చివరి నిమిషం వరకు నమ్మించి గొంతు కోశాడని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా గత ఎన్నికల్లో పనిచేసి, కాకా కుటుంబం అంటే ఏంటో చూపించామన్నారు. న్యాయం కోసం మాత్రమే పనిచేస్తానని, నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని చెప్పారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వారికే పట్టం కడుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని గతంలో తానే డొనేట్ చేశానని, ఆ విగ్రహాన్ని వేరే చోటుకు తరలించే ముందు తనకు ఒక మాట చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుతో దళితులకు స్ఫూర్తి, ధైర్యం వస్తుందని, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 120 విగ్రహాలను తాను డొనేట్ చేశానని వెల్లడించారు.
అంబేద్కర్ స్ఫూర్తితో బీజేపీపై పోరాడుదాం: గడ్డం వంశీకృష్ణ
బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, దీనిని అందరం కలిసి తిప్పికొట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో మాట్లాడే హక్కు లేకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేస్తున్నదని మండిపడ్డారు. సమాన హక్కులు కల్పించాలనే అంబే ద్కర్ ఆలోచనతో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి హైదరాబాద్‌లో అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించార న్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణ కోసం అంతా కలిసి పోరాటం చేసే టైమ్ వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో దళిత జాతిని చీల్చే కుట్ర జరుగు తోందని, అందరూ ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకుంటామన్నారు.
అణగారినవర్గాల నాయకుడు అంబేద్కర్: వివేక్ వెంకటస్వామి
దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకుడు బీఆర్ అంబేద్కర్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావరిఖని, ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే దేశంలో పరిపాలన సజావుగా సాగుతుందన్నారు. కార్మికులు, దళితులు, మహిళలకు అనేక హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
దళితులందరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే సూచించారు. అంబేద్కర్ సైతం కుల వివక్షకు గురయ్యారని పేర్కొన్నారు. 75 సంవత్సరాల క్రితమే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కోసం అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేశారని కొనియాడారు. కాగా, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, గోదావరి ఖనిలో అంబేద్కర్ విగ్రహాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే, మంథనిలో కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ అన్ని వర్గాలకు ఆశాజ్యోతి అని అన్నారు. ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.