చెన్నూరులో నామినేషన్ వేసిన వివేక్ వెంకటస్వామి

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వివేక్ వెంకటస్వామి ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. పారేపల్లి కాలభైరవస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. చెన్నూరు లో బాల్కసుమన్ గూండాయిజం చేస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా తన వాహనాన్ని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు తీసుకెళ్లారని అన్నారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, ఈసీకి కూడా కంప్లయంట్ చేస్తామని చెప్పారు.

 తాము నిబంధనలు అతిక్రమించడం లేదని వివరించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అయినా మంత్రైనా, సీఎం అయినా అంతా సమానమేనని, అందరూ అభ్యర్థులేనని అన్నారు. చెన్నూరు ప్రజలు బీఆర్ఎస్ గూండాయిజాన్ని సహించరని అన్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని, హస్తం గుర్తుకు ఓటేస్తమని చెబుతున్నారని చెప్పారు. నిన్ని శెట్ పల్లి, కుందారం గ్రామాల్లో పర్యటించానని, భారీ సంఖ్యలో అండగా నిలిచారని చెప్పారు. 

బాల్క సుమన్ ప్రజలను కలవడం లేదని, కార్యకర్తలకు కూడా దొరకడం లేదని అన్నారు. తాను పదేండ్లుగా గెలిచినా ఓడినా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజల వెంటే ఉన్నానని చెప్పారు. వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నానని చెప్పారు. వారానికి రెండు మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉంటున్నానని చెప్పారు.  ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులున్నారు.